School Bus Accident in Nellore District: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కావలి జాతీయ రహదారిపై స్కూల్ బస్సును ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. 15 మంది విద్యార్థులు గాయాలపాలవ్వగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన విద్యార్థులను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో 36 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా జాతీయ రహదారిపై స్కూల్ యాజమాన్యం డివైడర్‌ను ఏర్పాటు చేయడంతో ఈ ప్రమాదం జరిగింది. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డికి చెందిన పాఠశాల కావడంతో డివైడర్‌ను ఏర్పాటు చేసినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి జాతీయ రహదారి డివైడర్‌ను ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.