Yeleru Floods Victims Problmes : ఏలేరు అతి భారీ వరదలతో విరుచుకుపడి ఊళ్లను, పంట పొలాలను ముంచేసిన తీరు చూసి రైతులు కంటతడిపెడుతున్నారు. జలాశయానికి 5.72 టీఎంసీల వరద ఇన్ఫ్లో రాగా నాలుగున్నర టీఎంసీల నీరు దిగువకు వదిలారు. రికార్డు వరద ఆయకట్టు పరిధిలోని 7 మండలాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఏళేశ్వరం, కిర్లంపూడి, గొల్లప్రోలు, ఉప్పాడ కొత్తపల్లి, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట మండలాల్లో 60,000లకు పైగా వరి, ఇతర పంటల్ని ముంచేసింది. పలు చోట్ల కాల్వలకు గండ్లు పడి ఏపుగా పెరిగిన వరి పంట నీట మునిగింది.
పెట్టుబడి అంతా వరదపాలైందని ఆవేదన :వరద తగ్గిన తర్వాత పంట పొలాలకు కలిగిన నష్టం చూసి రైతులు తల్లడిల్లుతున్నారు. ఇసుక మేటలు పేరుకుపోవడంతో వాటిని ఎలా తొలగించాలో తెలియక సతమతమవుతున్నారు. కిర్లంపూడి మండలంలోనే అత్యధికంగా గండ్లు పడ్డాయి. భీకర ప్రవాహాలు మరిన్ని జనావాసాల్ని ముంచెత్తకుండా 22 చోట్ల గండి కొట్టారు. తాజాగా 100 ఎకరాలకు పైగా ఇసుక మేటలు పొలాల్లో వేశాయి. పెద్ద పెద్ద రాళ్లు, తుప్పలు, డొంకలు కొట్టుకొచ్చి సారవంతమైన భూముల్లో మేట వేశాయి.
"పొలాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాం. వేల ఎకరాల్లో ఇసుక మేటలు, రాళ్లు రప్పలతో కప్పేశాయి. ఇక సాగు చేసే పరిస్థితి లేదు. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టాం. ఇప్పుడు పెట్టుబడంతా వరద పాలైంది. కౌలు రైతులకు పరిహారం ప్రకటించలేదు. ప్రభుత్వం కౌలు రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. ఎకరానికి పది వేలు ఇస్తామన్నారు. ఇసుక మేటలు పేరుకుపోవడంతో వాటిని ఎలా తొలగించాలో అర్ధం కావడం లేదు. ప్రభుత్వమే మమల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం." - బాధిత రైతులు