Elevated Corridors in Hyderabad to Srisailam National Highway : నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిలో మన్ననూరు నుంచి పాతాళగంగ వరకు రోడ్డు విస్తరణ ప్రాజెక్టుకు 147.31 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ రోడ్డు విస్తరణ ప్రాజెక్టు నల్లమల అటవీప్రాంతం, అమ్రాబాద్ టైగర్‌రిజర్వు మీదుగా ఉన్న నేపథ్యంలో కేంద్ర ఉపరితల రవాణాశాఖ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు రాష్ట్ర అటవీశాఖతో ఇటీవల సమావేశమయ్యారు. ప్రతిపాదిత ప్రాజెక్టు గురించి వివరించారు. అరణ్యభవన్‌లో జరిగిన సమావేశంలో అటవీశాఖ నుంచి పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్, పీసీసీఎఫ్ (వైల్డ్‌లైఫ్) ఎలూసింగ్ మేరు హాజరయ్యారు.
30 అడుగుల ఎత్తులో ఎలివేటెడ్ కారిడార్ : హైవే-756లో హైదరాబాద్-శ్రీశైలం సెక్షన్ మధ్య ప్రస్తుత ట్రాఫిక్, రానున్నకాలంలో పెరిగే రద్దీని దృష్టిలో పెట్టుకుని 2 వరుసల నుంచి 4 లేన్లుగా విస్తరించే ప్రణాళికను వివరించారు. వన్యప్రాణులు తిరిగే ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తామని మిగతాచోట భూభాగంలోనే రోడ్డును విస్తరిస్తామని తెలిపారు. ఎలివేటెడ్ కారిడార్ దాదాపు 30 అడుగుల ఎత్తులో ఉండే అవకాశం ఉందని పేర్కొన్నట్లు సమాచారం. ఈ మేరకు హైదరాబాద్-శ్రీశైలం మార్గంలో 128.6 కి.మీ. నుంచి 191 కి.మీ. వరకు రోడ్డువిస్తరణ ప్రాజెక్టును ప్రతిపాదించారు. మన్ననూరుకు ముందున్న బ్రాహ్మణపల్లి నుంచి పాతాళగంగ వరకు తెలంగాణ పరిధిలో జాతీయ రహదారిని విస్తరిస్తారు.
రణస్థలంలో 6 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ - రూ.252 కోట్లుతో కేంద్రం గ్రీన్ సిగ్నల్
పాతాళగంగ తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వస్తుంది. తెలంగాణలో 62.5 కి.మీ. మేర రహదారిని విస్తరించాలన్నది ప్రణాళిక కాగా, ఇందులో 45.42 కి.మీ. మేర ఎలివేటెడ్ కారిడార్ వస్తుందని కేంద్ర ఉపరితల రవాణా, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు అటవీశాఖకు వివరించారు. రోడ్డు విస్తరణకు అవసరమయ్యే భూమి విషయమై అధికారులు క్షేత్రస్థాయి సర్వే చేశారు. నల్లమల అటవీప్రాంతం, అమ్రాబాద్ టైగర్ రిజర్వులో అటవీ భూమి కావాలని అధికారులు అటవీశాఖకు తెలిపారు.