Relatives and Villagers Unveiled SP Balu Statue in Tamil Nadu:ప్రపంచవ్యాప్తంగా మనుషులకు దగ్గరయ్యి అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యమని, తామంతా ఆ కుటుంబంలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నామని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా పళ్లిపట్టు సమీపంలోని కోనేటంపేటలోని బాలు అమ్మమ్మ ఊరిలో బంధువులు, స్నేహితులు, గ్రామస్థులు బాలు విగ్రహాన్ని అవిష్కరించి అభిమానం చాటుకున్నారు. తమ కుటుంబ ఖ్యాతిని, గ్రామం పేరును ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి బాలు అని, ఆయనను నిత్యం స్మరించుకొనే ఆలోచనతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.
విగ్రహవిష్కరణకు ఎస్పీ బాలసుబ్రమణ్యం సతీమణి సావిత్రి, బాలు సోదరి ఎస్పీ శైలజ, శుభలేఖ సుధాకర్ దంపతులు, ఇతర కుటుంబ సభ్యులు, బాల్య స్నేహితులు హాజరయ్యారు. పూజలు నిర్వహించి విగ్రహాన్ని ఆవిష్కరించారు. గ్రామస్థులు బాల సుబ్రమణ్యంతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన రక్త సంబంధీకులు అందరూ ఏడాదిలో ఒక్కరోజైనా ఆయన పుట్టిన చోటుకు వచ్చి ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటామని ఎస్పీ శైలజ, శుభలేఖ సుధాకర్ దంపతులు తెలిపారు. తన బావ బాలసుబ్రమణ్యం భౌతికంగా లేకపోయినా తమ గుండెల్లో పదిలంగా ఉన్నారని అన్నారు. ఆయన పుట్టి, తిరుగాడిన నేలపై ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలన్న గ్రామస్థుల కోరిక, సహకారంతో విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు బాలు సమీప బంధువు భానుమూర్తి తెలిపారు.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ షురూ - పూజా కార్యక్రమాలతో లాంఛనంగా - Prashanth Neel NTR 31