GMR Care Hospital Rare Brain Surgery :పాటలు వినిపిస్తూ సర్జరీ చేసిన డాక్టర్లు.. వినేందుకు కొంచెం ఆశ్చర్యంగానే ఉన్నా ఇది నిజమేనండీ. మెదడులో రక్తస్రావంతో బాధపడుతున్న ఓ మహిళా రోగికి పాటలు వినిపిస్తూ ఆపరేషన్ విజయవంతగా జరిపారు వైద్యులు. అరుదైన చికిత్స చేసి డాక్టర్లు ఓవైపు ప్రశంసలందుకుంటుంటే, మరోవైపు సాంగ్స్ ప్రభావం మామూలుగా లేదు కదా అంటూ నెటిజన్లు అవాక్కవుతున్నారు.
Patient Listening SPB Songs During Suregery :విజయనగరం జిల్లా రాజాంలోని జీఎంఆర్ కేర్ ఆసుపత్రి వైద్యులు వృద్ధురాలికి మత్తు మందు ఇవ్వకుండానే మెదడుకు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పక్షవాతం లక్షణాలతో బాధపడుతున్న 65 ఏళ్ల మహిళను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు ఆమె మెదడులో రక్తస్రావం జరుగుతున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే శస్త్రచికిత్స చేయాలని వారికి తెలిపారు.
వయోభారంతో పాటు హృద్రోగం, ఉబ్బసం ఉండటంతో రోగికి జనరల్ అనస్తీషియా(మత్తు మందు)ఇవ్వడం ప్రమాదకరమని వైద్యులు గుర్తించారు. అందుకు అనుగుణంగా ఈనెల 4న ఆమెను మెలకువగానే ఉంచి శస్త్రచికిత్సను డాక్టర్లు విజయవంతంగా పూర్తి చేశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలు వింటూ ఆమె ఆపరేషన్ చేయించుకున్నారు. సర్జరీ సమయంలో తాము అడిగే ప్రశ్నలకు సాధారణంగా రోగులు సమాధానాలు చెబుతారని వైద్యులు తెలిపారు. తద్వారా వారి ఇబ్బందులు తెలుసుకుంటూ ముందుకు సాగవచ్చని వారు పేర్కొన్నారు.