Vande Bharat sleeper trains :రాష్ట్రానికి కొత్తగా మరో రెండు వందేభారత్ రైళ్లు రానున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు రైళ్ల ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్ర మంత్రి పరిశీలనలో ఉన్నట్లు కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ వెల్లడించారు. అదే విధంగా వారణాసికి కొత్త రైలు ఏర్పాటుపైనా కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొత్త రైలు మార్గాల అంశంపై స్పందిస్తూ వచ్చే బడ్జెట్‌లో మచిలీపట్నం - నరసాపురం, నరసాపురం - కోటిపల్లి కొత్త రైల్వే లైన్లకు నిధులు కేటాయించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
విశాఖకు మోదీ రాక - రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక నెరవేరుతుందా?!
ఏపీలో ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల మీదుగా ఇప్పటికే వందేభారత్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి. ప్రయాణికుల నుంచి స్పందన మేరకు ఇటీవల మరికొన్ని కొత్త వందేభారత్ రైళ్ల కోసం ఏపీకి చెందిన ఎంపీలు రైల్వేమంత్రికి విన్నవించారు. దీంతో కూడా ప్రతిపాదనల్ని పరిశీలిస్తామని ఎంపీలకు హామీ ఇచ్చిన నేపథ్యంలో తాజాగా కొత్తగా మరో రెండు వందేభారత్ రైళ్లు తెరపైకి వచ్చాయి.
నరసాపురం - వారణాశి మధ్య కొత్త రైలు వచ్చే అవకాశం ఉందంటూ కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ రైల్వే లైన్‌లతో పాటుగా వందేభారత్ రైళ్ల ప్రతిపాదనలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం నరసాపురం - సికింద్రాబాద్ మధ్య వందేభారత్ రైలు ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. త్వరలో భీమవరం -–చెన్నై మధ్య మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. నరసాపురం - మచిలీపట్నం మధ్య నడపనున్న కొత్త రైలు మార్గం పనులకు సంబంధించి డీపీఆర్ ఇప్పటికే సిద్ధంగా ఉందని వెల్లడించారు.