Gates Repair Works in Prakasam Barrage :ప్రకాశం బ్యారేజ్ గేట్లను పడవలు ఢీకొని దెబ్బతిన్న కౌంటర్ వెయిట్లను ఇంజినీర్లు విజయవంతంగా అమర్చారు. నిపుణుడు కన్నయ్యనాయుడు ఆధ్వర్యంలో ఇంజినీర్లు రేయింబవళ్లు కష్టపడి కేవలం నాలుగు రోజుల్లోనే మరమ్మతులు పూర్తి చేశారు. కింద నుంచి ఉద్ధృతంగా నీరు ప్రవహిస్తున్నా తాడు, క్లేన్ల సాయంతో సాహసోపేతంగా మరమ్మతులు పూర్తి చేశారు. ట్రయల్ రన్ చేసి గేట్లు ఆపరేట్ చేశారు. ప్రకాశం బ్యారేజ్‌కి ఎలాంటి ముప్పు లేదని రైతులకు ఎలాంటి నష్టం ఉండదని కన్నయ్యనాయుడు ప్రకటించారు. రికార్డు సమయంలోనే బ్యారేజ్ వద్ద మరమ్మతులు చేసినందుకు కన్నయ్యనాయుడుతోపాటు ఇంజినీర్లు, అధికారులను సన్మానించారు. బీజేపీనేత పాతూరి నాగభూషణం సహా కూటమి నేతలు కన్నయ్యనాయుడును శాలువాతో సత్కరించి అభినందించారు. ప్రస్తుతం కౌంటర్ వెయిట్లను కాంక్రీట్‌తో నింపే పనిని వేగవంతం చేశారు. ఈరోజుతో గేట్ల మరమ్మతు పనులు పూర్తి కానున్నాయి.
నిరంతరాయంగా శ్రమిస్తూ17 టన్నుల బరువున్న కౌంటర్ వెయిట్‌ను 3 భాగాలుగా కత్తిరిస్తున్నారు. అదే సమయంలో ఇప్పటికే 67, 69 గేట్లకు ఏర్పాటుచేసిన కౌంటర్ వెయిట్లను కాంక్రీట్‌తో నింపే పనిని వేగవంతం చేశారు. 4.5 టన్నులున్న వాటి బరువును 17 టన్నులకు పెంచే ప్రక్రియ చేపట్టారు. ఇవాళ 3 కౌంటర్ వెయిట్లలోనూ కాంక్రీట్‌తో నిర్ణీత బరువు నింపడం సహా యథాతథంగా గేట్లు నిర్వహించేలా చేయనున్నారు.
బ్యారేజీ పటిష్ఠత పెంచేలా మరిన్ని చర్యలు : ఆదివారం సాయంత్రం బ్యారేజీపైకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు గేట్ల మరమ్మతు పనులను పరిశీలించారు. వేగంగా పనులు చేస్తుండటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. బ్యారేజీ పటిష్ఠత పెంచేలా మరిన్ని చర్యలు తీసుకోవాలని ప్రాజెక్టు గేట్ల నిపుణుడు, జలవనరులశాఖ సలహాదారు కన్నయ్యనాయుడుని సీఎం ఆదేశించారు.