YS Sharmila Comments on Prabhas: ప్రభాస్ ఎవరో తనకు తెలియదని, ఎటువంటి సంబంధం లేదని వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ 1,750 కోట్ల రూపాయల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీల దర్యాప్తులో వెల్లడైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్ తన స్వప్రయోజనాల కోసం చెల్లి, తల్లి పేర్లను వాడుకుంటున్నారని మండిపడ్డారు.
తొలుత జగన్, అదానీ స్కామ్ గురించి షర్మి మాట్లాడారు. అనంతరం ఓ విలేకరి ఇటీవల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా సమావేశం గురించి ప్రశ్న వేశారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ, ప్రభాస్ గురించి షర్మిల మాట్లాడారు. బాలకృష్ణ నివాసంలో ఉన్న ఐపీ అడ్రస్ నుంచి తనపై తప్పుడు ప్రచారం జరిగిందని, దీనిపై జగన్ కేసు పెట్టినట్లు ఇటీవల ఎంటర్‌టైనింగ్‌గా చెప్పారని షర్మిల ఎద్దేవా చేశారు. నిజంగానే చెల్లెలిపై జగన్ మోహన్ రెడ్డికి ప్రేమ ఉంటే, బాలకృష్ణ నివాసంలోని సిస్టమ్ ఐపీ అడ్రస్ నుంచి తప్పుడు ప్రచారం జరిగిందని నమ్మితే, గత ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి గాడిదలు కాశారా అని ఎద్దేవా చేశారు.
బాలకృష్ణ మీద ఎందుకు విచారణ చేపట్టలేదని, మీరిప్పుడు చెల్లెలిపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ప్రభాస్‌కూ తనకూ సంబంధం ఉందని జరిగిన అసత్య ప్రచారంపై తాను కేసు పెట్టిన వెంటనే ఎందుకు స్పందించలేదని నిలదీశారు. అదే విధంగా గతంలో తన విషయంలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు.