పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో గందరగోళం - ఓట్లు గల్లంతు - దరఖాస్తు చేసుకున్నా లేని పేర్లు (ETV Bharat) POSTAL BALLOT VOTING ANDHRA PRADESH: పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటుచేసిన పోస్టల్ బ్యాలెట్ల పోలింగ్ ప్రక్రియ గందరగోళంగా సాగింది. ఓటు వేసే అవకాశం లేకుండా చేస్తున్నారని ఉద్యోగులు అవేదన వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, తమకు ఓటు లేదని చెబుతున్నారని వాపోయారు.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. వైఎస్సార్సీపీ-తెలుగుదేశం వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. సత్తెనపల్లి వైపుగా వెళ్తున్న టీడీపీ శ్రేణుల వాహనాలను ఆపి అద్దాలు ధ్వంసం చేసి దాడికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ మూకలు రెచ్చిపోతుండటంతో పోలీసులు వారిని చెల్లాచెదురు చేశారు. ఓటమి భయంతోనే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దాడులు చేయిస్తున్నారని తెలుగుదేశం అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు.
పోస్టల్ బ్యాలెట్ పోలింగ్‌లో ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం- ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్యోగులు - POSTAL BALLOT voting problem in AP
నంద్యాలలో పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు ఉద్యోగులు బారులు తీశారు. జాబితాలో కొంతమంది పేర్లు రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. రిటర్నింగ్ అధికారి రాహూల్ కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆళ్లగడ్డలో ఎన్నికల నిర్వహణలో పాల్గొనే PO, APOలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వారిలో 70 మందికి పోస్టల్ బ్యాలెట్ కల్పించకపోవడంతో ఉద్యోగులు ధర్నాకు దిగారు. జాబితా ఇంకా రావాల్సి ఉందని సాకు చెబుతూ ఓటు హక్కు వేయనీయకుండా అధికారులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
నంద్యాల జిల్లా ఆత్మకూరులోని ఆర్వో కేంద్రాల వద్ద పోస్టల్ బ్యాలెట్ వినియోగంపై ఉద్యోగ, ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. తమ ఓటు ఎక్కడ ఉందో ఎన్నికల అధికారులకే తెలియదని అంటున్నారని మండిపడ్డారు. కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభానికి ముందు పెట్టెలకు తాళం వేసి లక్కీ డ్రా వేయలేదని ఆరోపించారు.
పోస్టల్ బ్యాలెట్ పోలింగ్‌లో గందరగోళం - జాబితాలో పేర్లు గల్లంతు - చేతులెత్తేసిన ఈసీ - POSTAL BALLOT VOTING ANDHRA PRADESH
వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 5న జమ్మలమడుగులో జరిగన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సమయంలో సుధీర్‌రెడ్డి పార్టీ కండువా కప్పుకుని లోపలికి వెళ్లారు. ఆయనపై రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ నేతలు మోహరించడంపై ఆర్వోకు కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి ఫిర్యాదు చేశారు. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద కనీస సౌకర్యాలు కల్పించలేదని ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్య వైఖరితో ఉద్యోగులు ఎండలో అవస్థలు పడ్డారు. ఆత్మకూరులో 4 గంటలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం కావడంపై ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం వద్ద ఓటర్ జాబితాలు ప్రదర్శించకపోవడంతో ఉద్యోగులు అయోమయానికి గురయ్యారు.
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్- పోలింగ్ ప్రక్రియ గందరగోళం - POSTAL BALLOT