Protest Against Tirumala Laddu Adulteration in AP : మాజీ సీఎం జగన్ పాలనలో తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కోట్లాది మంది భక్తుల మనోభావాలను జగన్ దెబ్బతీశారంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
కల్తీ నెయ్యిపై భక్తుల ఆగ్రహావేశాలు :వైఎస్సార్సీపీ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో కల్తీనెయ్యి వినియోగించడంపై భక్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ సత్య సాయి జిల్లా మడకశిరలో భక్తులు నిరసన తెలిపారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ గుంటూరు జిల్లా దుగ్గిరాలలో కూటమి నాయకలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్లకు కక్కుర్తిపడి వైఎస్సార్సీపీ నేతలు తిరుమల ప్రతిష్ఠతను దెబ్బతీశారని మాజీమంత్రి దేవినేని ఉమ విమర్శించారు . కల్తీ నెయ్యి వినియోగించారని ల్యాబ్ పరీక్షల్లో బయటపడిన తర్వాత కూడా జగన్ ఇంకా బుకాయిస్తున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. మిగిలిన ఆలయాల్లోనూ ప్రసాదాల నాణ్యత పరీక్షలు జరపాలని విశాఖ ఎంపీ శ్రీ భరత్ కోరారు.
భక్తుల మనోభావాలు దెబ్బతీశారని విమర్శలు : వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తిరుమల పవిత్రత తగ్గించే ప్రయత్నాలు జరిగాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు . సమగ్ర విచారణ తర్వాత నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. తిరుమల లడ్డూ తయారీలోనూ కల్తీకి పాల్పడటం క్షమించరాని నేరమని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మండిపడ్డారు. తిరుమల లడ్డూను అపవిత్రం చేయడం దుర్మార్గమైన చర్య అని బ్రాహ్మణ సంఘాలు మండిపడ్డాయి. కోట్లాది మంది భక్తుల మనోభావాలని జగన్ దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.