Police interrogated Former ASP Of CID Vijaypal For Two Days :ఉప సభాపతి, మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న CID మాజీ ASP విజయ్‌పాల్ విచారణ ముగిసింది. రిమాండ్‌లో ఉన్న విజయ్‌పాల్‌ను కోర్టు అనుమతులతో ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ రెండు రోజులపాటు (శుక్రవారం, శనివారం) విచారణ చేశారు. మొదటిరోజు 7 గంటలు, రెండో రోజు 5 గంటలపాటు విజయ్‌పాల్‌ను విచారించారు. దాదాపు 100 ప్రశ్నలు అడగగా చాలా ప్రశ్నలకు విజయ్‌పాల్ దాటవేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం తిరిగి గుంటూరుకు తరలించారు.
వైఎస్సార్సీపీ హయాంలో 2021 సంవత్సరంలో రఘురామకృష్ణరాజును అక్రమంగా అరెస్ట్ చేసి, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా దారుణంగా హింసించారు. అప్పటి జగన్ ప్రభుత్వంలోని సొంత ఎంపీనే ఇలా చిత్ర హింసలకు గురి చేయడం అప్పట్లో సంచలనమైంది. వైఎస్సార్సీపీ అధికారం కోల్పోయిన వెంటనే రఘురామకృష్ణరాజు ఈ సంఘటనపై పోలీసులు ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణను ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్‌కు అప్పగించారు. అనంతరం సీఐడీ మాజీ ASP విజయ పాల్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న అతన్ని న్యాయస్థానం అనుమతితో రెండు రోజుల పాటు విచారించారు.
రఘురామకృష్ణరాజు కేసు - తొలిరోజు విజయపాల్‌కు 50 ప్రశ్నలు - ఏడు గంటలపాటు విచారణ
గతంలో నవంబర్ 13వ తేదీన ఒకసారి, 26న మరోసారి విజయ్‌పాల్‌ను విచారించినప్పటికీ ఆయన సహకరించలేదు. తాజాగా శుక్ర, శని వారాల్లో మరోసారి ప్రకాశం ఎస్పీ దామోదర్ విచారించారు. అప్పటి సంఘటనలన్నీ ఒక్కొక్కటిగా అడిగినప్పటికీ విజయ్ పాల్ చాలా ప్రశ్నలకు సమాధానాలు దాటవేసినట్లు తెలుస్తొంది. అప్పట్లో విచారణకు తీసుకువచ్చిన సమయంలో ఎలాంటి దెబ్బలు లేని రఘురామకృష్ణరాజుకు విచారణ అనంతరం గాయాలు ఎలా అయ్యాయి? ముసుగులు వేసుకొచ్చిన నలుగురు వ్యక్తులు ఎవరు? అనే విషయాలపై గుచ్చి గుచ్చి అడిగారు. ఈరోజు (శనివారం) జరిగిన విచారణలో రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ సమయంలో ప్రత్యక్షంగా ఉన్న కొంతమంది సాక్షులను విజయ పాల్ ముందు ప్రవేశపెట్టి వారి సమక్షంలో ప్రశ్నలు సందించారు.
"సీఐడీ కస్టడీ మిస్టరీ" - ఈ కేసులో పెద్ద చేపలు త్వరలో తెరపైకి : RRR
దాదాపు 20 మంది సాక్షులు ప్రవేశపెట్టేసరికి విజయ పాల్ ఖంగుతిన్నారు. ఎస్పీ దామోదర్ ప్రశ్నలు వేయడం, సాక్షులు వాటిని ధ్రువీకరించడంతో విజయ పాల్‌కు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. "2021 మే 14న రఘురామకృష్ణరాజుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే దీనికి ముందు రోజే అరెస్టుకు అవసరమైన బృందాలను సిద్ధం చేసి హైదరాబాదుకు తరలించారు. అరెస్టు చేసే విషయంలో ఈ బృందాలకు ముందు రోజే మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదు రాకుండా, కేసు నమోదు కాకుండా ఈ బృందాలను ఎలా అప్రమత్తం చేసి తరలించారు?" అని ఎస్పీ ప్రశ్నించారు. దీనిపై కూడా విజయ్ పాల్ నీళ్లు నమిలారు. రెండు రోజుల విచారణలో తొలి రోజు 7గంటలు, రెండో రోజు 5 గంటలపాటు విజయ్ పాల్‌ను విచారించారు. దాదాపు 100 ప్రశ్నలు, వాటికి అనుబంధ ప్రశ్నలతో విజయ్ పాల్‌ను అధికారులు ఉక్కిరిబిక్కిరి చేశారు. చాలా ప్రశ్నలు విజయ్ పాల్ దాటవేసేందుకు ప్రయత్నించారు. విచారణ అనంతరం విజయ్‌పాల్‌ను తిరిగి గుంటూరుకు తరలించారు.
'ఏం రాజు గారూ ఇలా చేశారు' - విరిగిపోయిన మంచాన్ని చూసి ఏమీ ఎరగనట్లు అడిగారు