Police Help Behind Violence in Palnadu District: పల్నాడు జిల్లాలో పోలింగ్ రోజున జరిగిన దాడులు, ఎన్నికల అనంతర హింసాత్మక ఘటనలను పోలీస్ ఉన్నతాధికారులు విశ్లేషించే పనిలో పడ్డారు. మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజు కొందరు సీఐలు, ఎస్‌ఐలు, పూర్తిగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు చెప్పినట్లే పనిచేసినట్లు గుర్తించారు. పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గ సరిహద్దు పోలీసుస్టేషన్‌లో పనిచేసే ఎస్సై ఒకరు, తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి దగ్గరుండి టీడీపీ ఏజెంట్లను బయటికి పంపించినట్లు తెలిసింది. ఇంకో గ్రామంలో టీడీపీ ఏజెంట్లను బయటికి తరిమేసి ఏకపక్షంగా పోలింగ్ చేసుకుంటున్న వైఎస్సార్సీపీ ఏజంట్లను ఒక ఎస్సై అడ్డుకున్నా, సీఐ వెంటనే ఫోన్ చేసి జోక్యం చేసుకోకుండా నిలువరిచినట్లు తెలుస్తోంది.
పిన్నెల్లి సోదరులకు చేరవేశారు: పిన్నెల్లి సోదరులు పదుల సంఖ్యలో వాహనాల్లో తిరుగుతున్నా చోద్యం చూసిన సదరు సీఐ, ప్రత్యర్థుల రాకపోకల సమాచారాన్ని వైసీపీ వారికి ఇచ్చిమరీ దాడులకు ఉసిగొల్పారని అనుమానిస్తున్నారు. కారంపూడి సర్కిల్ పరిధిలోని ఎస్‌ఐ ఒకరు పోలింగ్ రోజు ప్రతిపక్ష నేతల కార్యకలాపాలు, పోలీసు సిబ్బంది కదలికల్ని పిన్నెల్లి సోదరులకు చేరవేశారు. కారంపూడిలో మంగళవారం నాటి ఘటనల్లోనూ సదరు ఎస్‌ఐ పాత్ర ఉన్నట్లు గుర్తించారు. రెంటచింతల మండలం రెంటాలలో బ్రహ్మారెడ్డిపై దాడి జరిగిన గంటకు కూడా అక్కడి బలగాలు చేరుకోకపోవడానికీ ఒక సీఐ నిర్వాకం, ఉద్దేశపూర్వక నిర్లక్ష్యమే కారణమనే అపవాదును పోలీసు శాఖ మూటగట్టుకుంది.
పోలీసుల నిర్లక్ష్యం: నరసరావుపేట మండలం దొండపాడులో పోలింగ్ సరళిని పరిశీలించడానికి వెళ్లిన తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు కారును వైఎస్సార్సీపీ మూకలు ధ్వంసం చేశారు. ఎంపీ దొండపాడు వెళ్తున్నారనే సమాచారన్ని వైఎస్సార్సీపీ నేతలకు ఒక ఎస్‌ఐ చేరవేసినట్లు అనుమానిస్తున్నారు! పోలింగ్‌రోజు నరసరావుపేట టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు కారుపైనా రాళ్ల దాడి జరిగింది. దానీకీ ఎస్సై పరోక్షంగా సహకరించారనే ఆరోపణలున్నాయి.