Police Arrested Fraudsters who Sold Tractors Leased from Farmers:రైతుల నుంచి ట్రాక్టర్లను లీజుకు తీసుకొని నెలవారి అద్దె చెల్లించకుండా తీసుకెళ్లిన ట్రాక్టర్లను ఏకంగా అమ్మి సొమ్ము చేసుకున్న మోసగాళ్లను శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 57 ట్రాక్టర్లు రికవరీ చేశారు. సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి తాడిమర్రి పోలీస్ స్టేషన్ ఆవరణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. నల్లచెరువు మండలం, బొమ్మిరెడ్డి పల్లికి చెందిన రవికుమార్ పులివెందులకి చెందిన బయ్యారెడ్డి, సింహాద్రి పురానికి చెందిన కాకర్ల హాజీవీరను పోలీసులు అరెస్ట్ చేశారు.
మరో ఎనిమిది మంది పట్టుబడాల్సి ఉందని ఎస్పీ పేర్కొన్నారు. తాడిమర్రి మండలంలో పలువురు రైతుల నుంచి ట్రాక్టర్లు లీజుకి తీసుకొని వాటిని ప్రకాశం జిల్లా తదితర ప్రాంతాల్లో ఈ ముఠా విక్రయించారని తెలిపారు. అగ్రిమెంట్లు చేయించుకుని పలువురులకు ట్రాక్టర్లను అమ్మకం చేశారు. తాడిమర్రికి చెందిన ట్రాక్టర్ యజమాని రామ్మోహన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టి 57 ట్రాక్టర్లను రికవరీ చేశామన్నారు మరికొన్ని ట్రాక్టర్లు రికవరీ చేయాల్సి ఉందని ఎస్పీ తెలిపారు.