Big Scam In Guntur GDCC Bank On Farmer Loans :రైతులు, మహిళా సంఘాలకు ఊతంగా నిలవాల్సిన గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు కొందరు రాజకీయ నేతలు, అక్రమార్కులకు ఏటీఎంలా మారింది. వైఎస్సార్సీపీ పాలనలో సొసైటీలకు ఎన్నికలను నిర్వహించకుండా పాలక వర్గాలను నామినేట్ చేయడంతో అక్రమాలకు పునాది పడింది. అప్పటి ఛైర్మన్ సహా కొందరు వైఎస్సార్సీపీ నేతలు చేసిన అక్రమాల తీగ లాగితే డొంక కదిలినట్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
నకిలీ ఆధార్ కార్డులు, పట్టాదారు పాసు పుస్తకాలు పెట్టి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వైనం బయటపడుతోంది. గుంటూరు గ్రామీణ మండలం నల్లపాడులోని జీడీసీసీ (Guntur District Co-Operative Central) బ్యాంకులో 70 కోట్ల రూపాయల రుణాలిచ్చారు. ఒక శీతల గిడ్డంగిలో నిల్వ ఉన్న మిర్చికి ఏకంగా రూ.53 కోట్ల రుణం ఇచ్చారు. 2022-23లో ఇచ్చిన రుణాలకు సంబంధించి ఇప్పుడు నోటీసులిస్తున్నారు. సిద్ధార్థ అనే వ్యక్తి బ్యాంకుకు వచ్చి అధికారులను నిలదీడంతో ఆయన పేరున ఉన్న రూ.10 లక్షల మొత్తాన్ని శీతల గిడ్డంగివారి నుంచి జమ చేయించేందుకు ప్రయత్నించారు.
Police Arrested 11 People On Fake Documents Scam Case : గుంటూరు జిల్లా కో ఆపరేటివ్ సొసైటీ సెంట్రల్ బ్యాంక్లో నకిలీ పత్రాలతో రుణాలు తీసుకున్న 30 మందిలో 11 మందిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ప్రత్తిపాడులో రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేట్టామని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. నిందితులు రైతుల పేరిట నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంక్లో రుణాలు పొందినట్లు గుర్తించామన్నారు. రైతుల ఆధార్ నంబర్లు సేకరించి, పేరు, చిరునామా మార్చి నకిలీ పట్టాదారు పుస్తకాలు తయారు చేస్తున్నారని ఎస్పీ వెల్లడించారు.