Polavaram Project New DPR Funds: పోలవరం ప్రాజెక్టులో కొత్త డీపీఆర్‌కు కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర ప్రస్తుతం కీలకంగా మారింది. ఆ ఆమోదం లభించక ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 16 వందల 15.47 కోట్ల రూపాయల నిధుల విడుదల ఆగిపోయింది. కేంద్ర మంత్రిమండలి సమ్మతిస్తేనే నిధులు విడుదలవుతాయి. వీటి కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
పోలవరం ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లాలంటే కేంద్రం నుంచి నిధులు విడుదల కావాల్సి ఉంది. దీంతో సీఎం చంద్రబాబు రెండ్రోజుల దిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, జలవనరుల శాఖ మంత్రి పాటిల్‌లతో ఈ విషయంపైనే చర్చించారు. చంద్రబాబు ప్రభుత్వం తొలి దశ, మలిదశ అన్న జోలికి పోకుండా పోలవరం ప్రాజెక్టులో 45.72 మీటర్ల స్థాయికి నీళ్లు నిలబెట్టడానికి తగిన భూసేకరణ, పునరావాసం సహా అన్నింటికీ విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వమే నిధులివ్వాలనే దృక్పథంతో ముందుకెళ్తోంది. పోలవరంలో పనులు ముందుకు తీసుకెళ్లాలంటే నిధులు తక్షణావసరం. అందుకే ప్రస్తుత డీపీఆర్ ఆమోదం పొందడంతో పాటు పోలవరంలో 45.72 మీటర్ల స్థాయికి నీళ్లు నిలబెట్టేలా అవసరమైన అన్ని పనులకూ నిధులు ఇచ్చేలా మరో డీపీఆర్‌కు ఇప్పుడే అడుగులు వేయాల్సి ఉంటుంది. అందుకే సీఎం చంద్రబాబు ఈ విషయంపై కేంద్రంతో చర్చించారు.
పోలవరంపై విదేశీ నిపుణుల బృందం తుది నివేదిక - త్వరలో కీలకాంశాలపై వర్క్‌షాప్ - Report on Polavaram Project
ప్రస్తుతం పోలవరం తొలిదశ పేరుతో 30 వేల 436.95 కోట్ల రూపాయలకు కొత్త డీపీఆర్ సిద్ధంగా ఉంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘం, సాంకేతిక సలహా మండలి, రివైజ్డ్ కాస్ట్ కమిటీ, పెట్టుబడుల అనుమతి మండలి ఆమోదాలు పొంది ఉంది. కేంద్ర మంత్రిమండలి ఆమోదం కోసం వేచి చూస్తోంది. గతంలో 2010-11 ధరలతో రూ.16,010.45 కోట్లకు డీపీఆర్ ఆమోదం పొందింది. ఆ ప్రకారం నిధులన్నీ కేంద్రం తిరిగి చెల్లించింది. తొలిదశ పేరుతో సిద్ధంగా ఉన్న డీపీఆర్ కేంద్ర ఆమోదం పొందితే రాష్ట్రానికి రూ.12,157.53 కోట్లు అందుతాయి.
తొలి దశ డీపీఆర్‌ను ఆమోదించే క్రమంలో జగన్ ప్రభుత్వంతో చర్చల సందర్భంగా నాటి కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి సోమనాథ్ పోలవరం ప్రాజెక్టుకు ఇక ముందు కొత్తగా మరో డీపీఆర్ ఆమోదించబోమని పేర్కొన్నట్లు తెలిసింది. విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నిధులు కేంద్రమే భరించాలి. కానీ ప్రస్తుతం కేంద్ర కేబినెట్ కార్యదర్శి హోదాలో ఉన్న ఆయన అలాంటి చర్చ ఎలా తీసుకువచ్చారనేది ప్రశ్నార్థకమే. తాజా డీపీఆర్ ఆమోదించే క్రమంలో అలాంటి షరతు ఏమీ లేకుండా ప్రభుత్వం జాగ్రత్తపడాలని నిపుణులు సూచిస్తున్నారు.
పోలవరం కొత్త డయాఫ్రం వాల్‌కు గ్రీన్‌సిగ్నల్ - మేఘాకే నిర్మాణ పనులు! - CM Chandrababu Delhi Tour