PM Modi Comments About Nara Lokesh: విశాఖలో బుధవారం 2 లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంతో పాటు అంతకుముందు నిర్వహించిన రోడ్‌షో ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రజల కల, విభజన హామీల్లో కీలకమైన విశాఖ రైల్వేజోన్, పారిశ్రామికహబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్కులకు శంకుస్థాపనలు చేశారు. సభా వేదిక పైనుంచి వర్చువల్‌గా అభివృద్ధి పనులకు ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.
ఇంతకీ ఈ వ్యాఖ్యలు ఎవరి గురించో కాదు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ గురించి. నారా లోకేశ్ మీద ఫిర్యాదు ఉందని ప్రధాని అన్నారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు వైపు చూశారు. ఇసలు ఇంతకీ ఆ ఫిర్యాదు ఏంటి? నారా లోకేశ్ దానికి ఏమని సమాధానం ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు: మంత్రి నారా లోకేశ్‌పై ఓ ఫిర్యాదు ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. విశాఖలో ఈ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. వేదికపైకి వెళ్లే ముందు గ్రీన్ రూంలో ప్రధానిని ఆహ్వానించడానికి మంత్రులు సిద్ధంగా ఉన్నారు. ప్రధాని అక్కడికి రాగానే అందరూ వరుస క్రమంలో ప్రధానికి నమస్కరించారు. అందరికీ నమస్కారం పెట్టుకుంటూ వెళ్లిన ప్రధాని నారా లోకేశ్ వద్ద ఆగారు.
ప్రధానికి నమస్కరించిన వెంటనే నీ మీద ఒక కంప్లయింట్ ఉంది లోకేశ్ అని ప్రధాని మోదీ అన్నారు. ఆ ఫిర్యాదు ఏంటో మీకు తెలుసు కదా అని పక్కనే ఉన్న చంద్రబాబు వైపు చూసి చమత్కరించారు. ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయ్యింది. దిల్లీ వచ్చి తనను ఎందుకు కలవలేదని మోదీ లోకేశ్‌ని ప్రశ్నించారు. కుటుంబ సమేతంగా వచ్చి తనను కలవాలంటూ లోకేశ్ భుజం తట్టారు. త్వరలోనే వచ్చి కలుస్తా సార్ అంటూ ప్రధానితో లోకేశ్ అన్నారు. ఇరువురి మధ్య సంభాషణను మంత్రులు ఆసక్తిగా గమనించారు.
రాష్ట్ర ప్రజల ఆశయాల సాధనకు మద్దతుగా నిలుస్తాం: ప్రధాని మోదీ