PM Modi Inaugurated Juvvaladinne Fishing Harbor:నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. వర్చువల్ విధానంలో చేసిన ఈ ప్రారంభోత్సవాన్ని నెల్లూరు కలెక్టరేట్ నుంచి వర్చువల్‌గా మత్స్యకారులు వీక్షించారు. చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మంత్రి నారాయణ, కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. 2018లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు శంకుస్థాపన చేసిన హార్బర్ మళ్లీ ఆయన హయాంలోనే అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు.
రాష్ట్రంలోని తూర్పు తీరం మత్స్యకారులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ అందుబాటులోకి రావడంతో చేపల వేట సులువు కానుంది. అలాగే నిల్వ సమస్య తీరనుంది. ఎప్పటినుంచో పడుతున్న సమస్యలు తీరిపోతాయని మత్స్యకారులు చెబుతున్నారు. రూ.288 కోట్లతో నిర్మించిన హార్బర్‌కు 12 వందల 50 బోట్లు నిలబెట్టే సామర్థ్యం ఉంది. దీనిద్వారా 9 మండల పరిధిలోని 98 మత్స్యకార గ్రామాల్లో ఉన్న 12 వేల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరనుంది.
ప్రకాశం -నెల్లూరు జిల్లా వరకు తీరంలో మత్స్యకారులు అనేక కష్టాలు పడుతున్నారు. దొరికిన చేపలను నిల్వ చేసుకునేందుకు వీలు లేక వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. తీర ప్రాంత మత్స్యకారుల కోసం 2018లో అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు పనులకు శంకుస్థాపన చేశారు. దీంతో రాష్ట్రంలో మూడో ఫిషింగ్ హార్బర్ సిద్ధమైందని చెప్పారు. బోగోలు మండలం జువ్వలదిన్నెలో కొత్త ఫిషింగ్ హార్బర్‌కు కేంద్రమైంది. మత్స్యకారుల వేటకు జీవనోపాధికి ఆధారమైన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను దేశ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో ప్రారంభించడం ఆనందంగా ఉందని మత్స్యకారులు అంటున్నారు.