ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆంధ్రప్రదేశ్​లోనూ ఫోన్​ ట్యాపింగ్​! - మాట్లాడాలంటేనే వణుకుతున్న నేతలు, అధికారులు - Phone Tapping in Andhra Pradesh

Phone Tapping in Andhra Pradesh: నేను ఉన్నాను, నేను విన్నాను! ఇదీ అధికారంలోకి రాకముందు జగన్‌ స్లోగన్‌! కానీ, అధికారంలోకి వచ్చాక సొంత పార్టీ నేతలకే ఆయన దర్శనమివ్వరు! ఒకరిద్దరిని తప్ప, అధికారుల్నీ దరిదాపుల్లోకి రానివ్వరు! విమర్శకులనైతే ఆమడదూరంలో ఆపేస్తారు. కానీ, ఆయన గురించి ఎవరేం అనుకుంటున్నారో అన్నీ పసిగట్టేస్తారు. ఎక్కడో కూర్చుని మొత్తం వినేస్తారు! తన, మన అనే తేడాల్లేవ్‌! ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫోన్‌లో మాట్లాడాలంటే బెంబేలెత్తుతున్నారు. ట్యాపింగ్ భయంతో చాలామంది స్వేచ్ఛగా ఫోన్‌ కూడా వినియోగించలేకపోతున్నారు. ఎక్కడ నిఘాపెట్టారో? ఎటు నుంచి వింటున్నారో తెలియక నోరు కట్టేసుకుంటున్నారు.

Phone_Tapping_in_Andhra_Pradesh
Phone_Tapping_in_Andhra_Pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 21, 2024, 7:33 AM IST

Updated : Mar 21, 2024, 8:24 AM IST

ఆంధ్రప్రదేశ్​లోనూ ఫోన్​ ట్యాపింగ్​! - మాట్లాడాలంటేనే వణుకుతున్న నేతలు, అధికారులు

Phone Tapping in Andhra Pradesh: రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, న్యాయనిపుణులు, జర్నలిస్టులు, చిన్నపాటి నాయకులు, ఇలా ఒకస్థాయి ఉన్న ఎవర్ని కదిపినా తమను ఎవరో వెంటాడుతున్నారనే భయం! ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నారనే వణుకు! నలుగురు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు ఎక్కడైనా కలిసినా స్వేచ్ఛగా మాట్లాడుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి! పోనీ ఇంటికెళ్లాక ఫోన్ చేసైనా మాట్లాడదామంటే తమ మాటల్ని ఎవరు వింటున్నారో అనికలవరపడుతున్నారు.

సామాజిక మాధ్యమాల్లో విమర్శనాత్మక పోస్టులు పెడితేనే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న సర్కారు, మొబైల్‌ ఫోన్‌లోనూ స్వేచ్ఛగా మాట్లాడుకోలేని పరిస్థితుల్లోకి నెట్టిందనే ఆందోళన వివిధ వర్గాలవారిని అనుక్షణం వెంటాడుతోంది. అందుకే చాలామంది నోరు కట్టేసుకోవడమే మంచిదనే నియమం పాటిస్తున్నారు. రాష్ట్రంలో ట్యాపింగ్‌కు తమ, పర బేధం లేదనే పరిస్థితి నెలకొంది. చాలామంది అధికారులు, నేతలైతే, అయిదేళ్లుగా సాధారణ కాల్స్‌ చేయడమనే మాటే మరచిపోయారు. మెసేజెస్‌ కూడా చేయడంలేదు. వాట్సప్, సిగ్నల్, ఫేస్‌టైమ్‌ యాప్‌లు ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వ అధికారుల్లో 90% మంది ఎవరితో ఫోన్లో మాట్లాడాలన్నా వణికిపోతున్నారు.

ఫోన్ ట్యాపింగ్​ ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలి: టీడీపీ

ఇద్దరు వ్యక్తులు ఏం మాట్లాడుకున్నారో తెలియాలంటే అందులో ఒక్కరి ఫోన్‌ ట్యాప్‌ చేసినా సరిపోతుంది. కొందరు నేతల విషయంలో ఇదే జరిగింది. మొబైల్‌కు లింక్‌ పంపి దాన్ని క్లిక్‌ చేయించేలా చూడటం ద్వారా ఫోన్‌ ట్రాక్‌ చేస్తున్నారు. ఒకసారి ట్రాకింగ్‌ మొదలయ్యాక మైక్రో ఫోన్‌ నిరంతరం పని చేస్తూనే ఉంటుంది. సంబంధిత వ్యక్తి ఫోన్లోనే కాకుండా, ఆ ఫోన్​ను పక్కన పెట్టుకుని ఎప్పుడు, ఎవరితో ఏం మాట్లాడినా అవన్నీ రికార్డు అవుతూనే ఉంటాయి.

సొంత పార్టీ పాలనలోనే ఫోన్‌ ట్యాపింగ్‌ భయం: అధికార పార్టీకి చెందిన ఒక సీనియర్‌ రాజకీయ నేత తనతో మాట్లాడేందుకు ఎవరు వచ్చినా వారి మొబైల్‌ ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను స్విచ్‌ ఆఫ్‌ చేయిస్తారు. ఐనా వాటిలోని మైక్రోఫోన్లు రికార్డు చేస్తాయనే భయంతో వాటిని దూరంగా మరో గదిలో పెట్టిస్తారు. తన ఫోన్‌ కూడా స్విచ్‌ ఆఫ్‌ చేసేస్తారు. సొంత పార్టీ పాలనలోనే ఫోన్‌ ట్యాపింగ్‌ భయం ఆయన్ని అంతగా వెంటాడుతోంది. ఎవరు ఫోన్‌ చేసినా స్పందిస్తారనే పేరున్న ఒక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కూడా వైసీపీ ఏలుబడిలో సాధారణ కాల్స్‌ మాట్లాడటమే మానేశారు. తప్పదనుకుంటే వాట్సప్‌లోనే మాట్లాడేవారు. అదీ సురక్షితం కాదని తోటి అధికారులు చెప్పడంతో తర్వాత టెలిగ్రామ్‌కు మారారు. ఇప్పుడు సిగ్నల్‌ యాప్‌ ద్వారా మాట్లాడుతున్నారు.

ఐఫోన్‌ ఉన్న వారితో మాత్రం ఫేస్‌ టైమ్‌లో కాల్స్‌ చేస్తున్నారు. సచివాలయంలో ఒక ఐఏఎస్​ అధికారి ఛాంబర్‌లోకి వెళ్లాలంటే ఫోన్‌ బయటే విడిచిపెట్టి వెళ్లాలి. మరో ఐఏఎస్‌ అధికారి అయితే తన దగ్గరకు వచ్చేవాళ్లు ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసిందాకా ఊరుకోరు. కీలకమైన విషయాలేమైనా మాట్లాడాల్సి వస్తే తన ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్‌ చేసేస్తారు. అప్పుడుగానీ ప్రశాంతంగా మాట్లాడలేరు. వాట్సప్‌ కాల్‌ అయితే నిమిషం మాట్లాడగానే కట్‌ చేస్తారు. ఒక్క నిమిషం దాటినా ఫోన్ ట్యాప్ చేసే అవకాశం ఉంటుందనేది ఆయన అనుమానం.

అన్నా.. జగనన్నా.. నీ ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తే..?: కోటంరెడ్డి

ప్రతికూల వార్త వచ్చిందంటే వణుకే: ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పత్రికల్లో ఏదైనా ప్రతికూల వార్త వచ్చిందంటే చాలు ఆ రోజు సంబంధిత కార్యాలయ అధికారులకు వణుకే! ఉదయం 7 గంటల లోపే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్‌ వస్తుంది. సంబంధిత విలేకరి కార్యాలయానికి వచ్చి ఎవర్ని కలిశారో ఆరా తీస్తారు. లేదంటే ఆయనతో ఎవరెవరు ఫోన్‌లో మాట్లాడారో తెలుసుకునేందుకు ఆ కార్యాలయంలోని ఉన్నతాధికారులే ప్రయత్నిస్తారు. ఆ వెంటనే ఉన్నతాధికారి దగ్గరకు వెళ్లి ఫలానా విలేకరి ఫోన్‌ చేశాడని, తాము ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వివరణ ఇచ్చుకుంటారు. నాలుగేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికశాతం ఉద్యోగులు ఇలాంటి భయాందోళనల మధ్యే విధులు నిర్వహిస్తున్నారంటే, ఎంతలా వెంటాడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

ఉపాధ్యాయ యూనియన్ల నుంచి అంగన్‌వాడీ సంఘాల నేతల వరకు హామీ నెరవేర్చాలని కోరే నిరుద్యోగుల సంఘం ప్రతినిధులు మొదలు చేసిన పనులకు బిల్లులు ఇవ్వమని కోరే గుత్తేదారుల సంఘం వరకు అందరిలోనూ ట్యాపింగ్‌ భయమే. ఎవరితోనైనా మాట్లాడితే చాలు, గంటల వ్యవధిలోనే పోలీసులు వారి ఇళ్ల వద్ద నిఘా పెడుతున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ చేయకపోతే తాము మాట్లాడినవాళ్ల ఇళ్ల వద్దకే పోలీసుల్ని ఎలా పంపగలరన్నది యూనియన్‌ నాయకుల ప్రశ్న.

"ప్రశ్నిస్తే పగబట్టారా ?.." కాక రేపుతున్న వైసీపీ ఎమ్మెల్యే ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలు

తప్పించుకునేందుకు పడరానిపాట్లు: ఫోన్‌ ట్యాపింగ్‌ నుంచి తప్పించుకునేందుకు కొందరు నేతలు, అధికారులు పడరానిపాట్లు పడుతున్నారు. తమ ఫోన్లను తరచూ ఫార్మాట్‌ చేయిస్తున్నారు. ఏ లింక్‌ పంపి ఏ బగ్‌ను ఇన్‌స్టాల్‌ చేశారో తెలియక నెలకోసారి ఫోన్‌లోని మొత్తం సమాచారాన్ని డిలీట్‌ చేయిస్తున్నారు. కొందరు అధికారులు తాము పెట్టిన మెసేజ్‌లు కొంత టైమ్​ తర్వాత డిలీట్‌ అయ్యేలా ఆప్షన్‌ పెట్టుకుంటున్నారు. రాజకీయ నేతల్లో చాలామంది తాము ఎక్కడున్నామో తెలియకుండా ఫోన్‌ లొకేషన్‌ను ఆఫ్ చేస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బంది లేని కొందరు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులైతే నెలకో ఫోన్ మార్చేస్తున్నారు. కొందరైతే బంధువుల పేర్లతో మరో నంబరు తీసుకుని దాని ద్వారా మాట్లాడుతున్నారు.

వైసీపీ ప్రభుత్వం ఇంటెలిజెన్స్‌లో వివిధ విభాగాలను ఏర్పాటు చేయడం ద్వారా ఎవరి ఫోన్‌ అయినా ట్యాప్‌ చేసేంత సాంకేతికత సమకూర్చుకుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణలో ఎస్​ఐబీ విభాగంలో పనిచేసిన డీఎస్పీ ప్రణీత్‌రావు అరెస్టు వ్యవహారం ఇప్పుడు ఏపీలోనూ చర్చనీయాంశమైంది. అక్కడ శాసనసభ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే తన ఆధీనంలోని 17 కంప్యూటర్లలో సమాచారాన్ని తొలగించి, హార్డ్‌డిస్క్‌లను ఆయన ధ్వంసం చేశారు. అధికార పార్టీ నేతలే ఆయన ద్వారా తమకు వ్యతిరేకులైన వారి ఫోన్లను ట్యాప్‌ చేయించారని, ప్రభుత్వం మారడంతో అవన్నీ బయటకొస్తాయనే భయంతోనే ఇలా చేశారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అంతకుమించిన భయాలు అన్ని వర్గాలనూ వెంటాడుతున్నాయి.

ప్రభుత్వం ఫోన్లు ట్యాపింగ్​ చేస్తోంది.. శ్రీధర్ రెడ్డి​ వ్యాఖ్యలే నిదర్శనం: వర్ల రామయ్య

Last Updated : Mar 21, 2024, 8:24 AM IST

ABOUT THE AUTHOR

...view details