Pensioners Died in Andhra Pradesh : పింఛన్ల పంపిణి విషయంలో జగన్ వేసిన పన్నాగం ఫలించింది. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా అమలు చేశారు. లబ్ధిదారుల చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. చివరికి మండుటెండల్లో మలమలమాడిపోయేలా కుట్రను చేశారు. దీని ఫలితంగా వృద్దులు మండుటెండలకు తాళలేక వడదెబ్బకు గురై కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఈ పాపం ఎవరిది. రాష్ట్రంలో ఇంత దారుణం జరుగుతుంటే జగన్‌కు వత్తాసు పలికే సీఎస్ జవహర్‌రెడ్డికి కనిపించలేదా అన్న ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
వడదెబ్బకు గురై వృద్ధురాలు మృతి :పెన్షన్ కథ దేవుడు ఎరుగు ఎండ తీవ్రతకు తాళలేక వడదెబ్బకు గురై వృద్ధులు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణంలో ఎల్లమ్మ అనే వృద్ధురాలు వడదెబ్బకు గురై మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళ్తే, బద్వేలులోని సురేంద్రనగర్‌కు చెందిన ఎల్లమ్మ పెన్షన్ తీసుకునేందుకు నిన్న(గురువారం) బద్వేలులోని స్టేట్ బ్యాంకుకు వెళ్లింది. ఎల్లమ్మకు రెండు బ్యాంక్ ఖాతాలు ఉండగా ఏ బ్యాంకులో డబ్బు జమ అయ్యిందనే విషయం తెలియక అటూ సచివాలయానికి, ఇటూ బ్యాంక్ చుట్టూ తిరిగింది. చివరికి స్టేట్ బ్యాంకులో పెన్షన్ తీసుకొని బయటకు వచ్చిన ఎల్లమ్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యింది.
వెంటనే అక్కడే ఉన్న కుమారుడు రామయ్య హుటాహుటిన ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు ఆమె వడదెబ్బకు గురైందని చెప్పారు. వైద్యులు ఎంత ప్రయత్నించిన ఆమె ప్రాణాలను మాత్రం కాపాడలేక పోయారు. తల్లి మరణంతో రామయ్య కుటుంబం మెుత్తం కన్నీటి పర్యంతమైంది. రాజకీయాలకోసం వృద్దులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయమని ఎల్లమ్మ కుటుంబసభ్యులు వాపోయారు.
వితంతు పింఛను కోసం వెళ్లి మహిళ మృతి : ఏలూరు జిల్లా పోలవరం పంచాయతీ పరిధిలోని బాపూజీ కాలనీకు చెందిన కస్తూరి కడెమ్మ అనే వితంతువు ఫించన్ తీసుకోవడానికి వెళ్లి అస్వస్థకు గురైయ్యారు. అనంతరం ఆమె కుమారులు సమీప ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు సూచించారు. వివరాల్లోకి వెళ్తే,పోలవరం పంచాయతీ పరిధిలోని బాపూజీ కాలనికి చెందిన కస్తూరి కడెమ్మ వితంతు పింఛను తీసుకోవడం కోసం గురువారం మధ్యాహ్నం స్టేట్ బ్యాంకుకు వెళ్లింది. అనంతరం పింఛన్ తీసుకుని మండటెండల్లో కాలినడకన ఇంటికి చేరుకుంది. సాయంత్రం కాగానే కడెమ్మ తీవ్ర అస్వస్థకు గురికావడంతో కూమారులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు వెల్లడించారు. అలాగే చిత్తూరు జిల్లా కార్వేటి నగరం పద్మసరస్సులో పింఛను కోసం మండుటెండలో బ్యాంకుకు వెళుతూ వడదెబ్బకు గురై వృద్ధుడు గోపాలయ్య మృతి చెందారు.