Heavy Floods In Bhadradri Kothagudem : పెద్దవాగుకు గండితో దిగువన తెలంగాణలోని భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి, కోయరంగాపురం, కొత్తూరు, రమణక్కపేట గ్రామాలకు పాక్షికంగా నష్టం జరగ్గా, ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కమ్మరిగూడెం, ఒంటిబండ, కోయమాదారం, కొత్తపూచిరాల, పాతపూచిరాల, అల్లూరినగర్, సొందిగొల్లగూడెం, వసంతవాడ, గుళ్లవాయి, వేలేరుపాడు గ్రామాలకు భారీగా నష్టం సంభవించింది.
వరదలకు కొట్టుకుపోయిన ఇళ్లు :కొన్ని గ్రామాల్లో పలు ఇళ్లు వరదలో కొట్టుకుపోయాయి. సహాయక చర్యలు చేపట్టేందుకు వరద ప్రభావిత ప్రాంతాలకు అధికారులు చేరుకునే పరిస్థితి లేకుండా పోయింది. వారంతా వేలేరుపాడులోనే ఉండిపోయారు. దాదాపు 2000 కుటుంబాలు ఎవరి దారిన వారు సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నట్లు సమాచారం. గురువారం ఉదయం నుంచి విద్యుత్తు సరఫరా కూడా లేకపోవడంతో సెల్‌ఫోన్లు పనిచేయడం లేదు.
Peddavagu Project Floods :బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో ఆ గ్రామాల్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. పెద్దవాగుకు గండిపడిన నేపథ్యంలో ప్రాణనష్టం కలగకుండా చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. విషయం తెలుసుకుని జిల్లా కలెక్టర్ జితేష్, నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. గండి పూడ్చేందుకు రూ.20 కోట్ల వరకు ఖర్చవుతుందని జలవనరులశాఖ డీఈ కృష్ణ తెలిపారు. ఘటనాస్థలిని సీఈ శ్రీనివాసరెడ్డి, ఈఈ సురేష్ సందర్శించారు.
వరదలో చిక్కుకున్న 28 మంది :ఏపీలోని బుట్టాయిగూడెం మండలంలో పలు చెరువులు తెగడంతో పెద్దవాగుకు భారీగా వరదనీరు చేరింది. రెండుగేట్ల నుంచి 35 వేల క్యూసెక్కుల నీటిని వదులుతుండగా ఇన్‌ఫ్లో అనూహ్యంగా 70 వేల క్యూసెక్కులకు చేరింది. దాంతో మధ్యాహ్నం 3 గంటల నుంచి కట్ట పైనుంచి వరద ప్రవహించింది. ఏక్షణమైనా ఆనకట్టకు గండిపడుతుందని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అనుకున్నట్లే రాత్రి 7.45 గంటలకు గండి పడింది. అశ్వారావుపేట మండలం నారాయణపురంలోని కట్టమైసమ్మ ఆలయం సమీపంలో 28 మంది వరదలో చిక్కుకున్నారు. వారిలో రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రయాణికులు ఉన్నారు.