Payyavula Key Suggestions in GST Meet :ఐదు శాతానికి మించిన జీఎస్టీ శ్లాబుల్లో ఉన్న వస్తువులు రాష్ట్రంలో రవాణా అయితే వాటిపై ఒక్కశాతం ఆంధ్రప్రదేశ్ ఫ్లడ్ సెస్ విధించాలని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ జీఎస్టీ సమావేశంలో ప్రస్తావించారు. దీనివల్ల పేదలు, మధ్యతరగతి ప్రజలపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపారు. ఈ సెస్ ద్వారా రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస చర్యలు చేపడతామని పేర్కొన్నారు. 2018లో కేరళ వరదల సమయంలో ఇదే తరహా సెస్ విధించారని గుర్తు చేశారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో నిర్వహించిన 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు
ఇన్నోవేషన్లకు ప్రోత్సాహమిచ్చేలా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు నిర్వహించే రీసెర్చ్ సర్వీసెస్‌కు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని పయ్యావుల కేశవ్ తెలిపారు. ఐజీఎస్టీ సెటిల్‌మెంట్ వ్యవస్థను మరింత పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్రాలకూ డేటా అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. చిన్న వ్యాపారస్తులు కాంపోజిషన్ జీఎస్టీ చెల్లింపుదారులకు అద్దెల విషయంలో విధించే రివర్స్ ఛార్జ్ మెకానిజం-ఆర్సీఎం నుంచి మినహాయింపు ఇవ్వాలని పయ్యావుల కేశవ్ విజ్ఞప్తి చేశారు.
55th GST Council Meeting :ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో భాగంగా జీఎస్టీ రిజిస్ట్రేషన్లను మరింత సులభతరం చేసేందుకు టెక్నాలజీని వినియోగించుకోవాలని పయ్యావుల కేశవ్ చెప్పారు. బోగస్ రిజిస్ట్రేషన్లను అరికట్టాలని వివరించారు. అదేవిధంగా పేదలకు రేషన్ ద్వారా ఇచ్చే పోర్టిఫైడ్ బియ్యంపై జీఎస్టీ సుంకాన్ని తగ్గించాలని పయ్యావుల కేశవ్ జీఎస్టీ కౌన్సిల్‌ను కోరారు.