Pawan Kalyan Interesting Comments in Gollaprolu : తనను భారీ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. శాఖలపై అధ్యయనానికి కొంత సమయం తీసుకున్నానని చెప్పారు. తక్కువ చెప్పి ఎక్కువ పని చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చాక పింఛన్లు పెంచి ఇచ్చామే తప్ప తగ్గించలేదన్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో ఏర్పాటు చేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
వ్యవస్థలను బలోపేతం చేస్తాం : అంతకుముందు పవన్ కల్యాణ్ లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. పెన్షన్ల పంపిణీ ఇవాళ పూర్తవుతుందని, ఒకవేళ ఇవాళ కాకపోతే రేపటి వరకు పూర్తి చేస్తామని పవన్ తెలిపారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులు, వ్యవస్థలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. వ్యవస్థలను చంపి వ్యక్తులు పెరుగుతున్నారని అన్నారు. అందుకే ఇప్పుడు వ్యవస్థలను బలోపేతం చేస్తామని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
'కడప వంటి చోట్ల గనులు మొత్తం ఖాళీ చేశారు. గతంలో అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారు. కనిపించిన ప్రతిచోటా డబ్బులు దండుకున్నారు.పంచాయతీ నిధులు ఎటు వెళ్లాయో తెలియట్లేదు. రూ.600 కోట్లతో రుషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు. అవే నిధులు ఇక్కడ ఉపయోగిస్తే జిల్లా అభివృద్ధి అయ్యేది. తప్పులు ఎవరు చేసినా సరిదిద్దుతాం. ఒక తరం కోసం కాదు రెండు తరాల కోసం పనిచేస్తా. నా వైపు నుంచి ఎలాంటి అవినీతి ఉండదని' పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
"నా దేశం, నేల కోసం పని చేస్తా, జీతాలు వద్దని చెప్పా. అద్భుతాలు చేస్తామని చెప్పట్లేదు, ప్రభుత్వం జవాబుదారిగా ఉంటుంది. నైపుణ్య శిక్షణ కేంద్రాల ద్వారా యువతలో ప్రతిభ వెలికితీయాలి. రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసమే నేను ఉన్నా. విజయయాత్రలు మాత్రమే చేయడానికి నేను సిద్ధంగా లేను. గెలిచినందుకు ఆనందం లేదు, పనిచేసి మన్ననలు పొందితేనే ఆనందం." - పవన్ కల్యాణ్, ఉప ముఖ్యమంత్రి