SVIMS Doctors Dharna in Tirupati : ఆసుపత్రుల్లో మహిళా వైద్యులు, సిబ్బంది రక్షణపై దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్న వేళ తిరుపతిలోని స్విమ్స్‌లో ఓ మహిళా జూనియర్ వైద్యురాలిపై రోగి దాడికి పాల్పడటం కలకలం రేపింది. తిరుమలలో ఓ భక్తుడు అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స కోసం అతణ్ని ఆసుపత్రికి తీసుకొచ్చారు. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ అక్కడే విధుల్లో ఉన్న వైద్యురాలు స్పందనపై అతడు జుట్టుపట్టి లాగి దాడికి పాల్పడ్డాడు. ఇది గమనించిన తోటి వైద్యులు ఆమెను కాపాడి అతని బారి నుంచి విడిపించారు.
Patient Attack on Junior Doctor in SVIMS :ఈ క్రమంలోనే జూనియర్ వైద్యురాలిపై జరిగిన దాడిని నిరసిస్తూ తమకు రక్షణ కల్పించాలంటూ జూడాలు, వైద్యులు అత్యవసర విభాగం వద్ద ఆందోళనకు దిగారు. విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. స్విమ్స్ సంచాలకులు ఆర్వీ.కుమార్, టీటీడీ విజిలెన్స్ అధికారి శివకుమార్‌రెడ్డి వైద్యులకు నచ్చజెప్పినా వారు శాంతించలేదు. టీటీడీ పర్యవేక్షణలో వైద్యులకు రక్షణ కల్పిస్తామని శివకుమార్‌రెడ్డి చెప్పినా వైద్యసిబ్బంది ససేమిరా అన్నారు.
"ఆ రోగి వచ్చి ఆమెను కొట్టారు. ఎందుకు కొట్టారో తెలియదు. అక్కడే ఉన్న వైద్యులు అప్రమత్తమై ఆయన నుంచి విడిపించే ప్రయత్నం చేశారు. సెక్యూరిటీ వాళ్లు ఎక్కడో ఉన్నారు. వారు వచ్చేలోగా ఏదైనా జరిగితే ఏవరిది బాధ్యత. రాత్రి విధుల్లో ఉంటే పరిస్థితి ఏంటి. రెండు వారాల క్రితం ఓ ఘటన జరిగితే జేఈవోకి ఫిర్యాదు చేశాం. ఇంతవరకూ దానిపై చర్యలు తీసుకోలేదు. ఇలాంటివి జరిగినప్పుడు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతారు. ఆ తర్వాత పట్టించుకోరు." - జూనియర్ వైద్యులు