Parents Worried About Cases Filed Against Youths in Election Violent:పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన మహేశ్‌రెడ్డి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఓటేద్దామని నరసరావుపేట వచ్చారు. వైఎస్సార్ మీద అభిమానంతో వైఎస్సార్సీపీ నిర్వహించే కార్యక్రమాల్లోనూ తరచూ పాల్గొంటున్నారు. పోలింగ్ రోజు సాయంత్రం నరసరావుపేటలోని గుంటూరు రోడ్డులో జరిగిన అల్లర్లలో పాల్గొన్నారు. నాయకుడి ప్రకటనలతో రెచ్చిపోయి కర్రలతో రోడ్డుపై పరుగులు పెట్టారు. ప్రస్తుతం పోలీసుల నుంచి 41ఏ నోటీసు రావడంతో అతని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఎప్పుడూ గొడవల జోలికి పోని తమ కుమారుడు ఇలా కేసుల్లో ఇరుక్కోవడంతో ఆందోళన చెందుతున్నారు.
భయాందోళనలో యువకుల కుటుంబాలు : ఇలా పల్నాడు జిల్లాలో పోలింగ్ అల్లర్లలో తలదూర్చిన యువకుల కుటుంబాలు భయాందోళనలతో బతుకుతున్నాయి. ఇళ్లకు పోలీసులు రావడం, నోటీసులు, అరెస్టులు అంటూ తిరగడంతో ఎప్పుడేం జరుగుతుందోనని భయపడుతున్నారు. ఎన్నికల గొడవల్లో తలదూర్చిన యువత సొంతూళ్లో ఉండలేక ఎక్కడో దూరాన ఉన్న బంధువుల ఇళ్లల్లో తలదాచుకుంటున్నారు. సినిమాలు చూసి కొందరు హీరోల్లా వెంటపడి తరిమికొట్టే అవకాశం వచ్చిందని మరికొందరు తమ అభిమాన నేత రెచ్చగొట్టారని ఇంకొందరు ఐదేళ్లుగా తమను హింసించి అక్రమ కేసులు పెట్టారని, ఇప్పుడు సమయం వచ్చిందని మరికొందరు ఇలా పోలింగ్ రోజు, మరుసటి రోజున జరిగిన అల్లర్లలో తలదూర్చారు.
బరితెగించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి- వీధిరౌడీని తలదన్నేలా ఈవీఎం ధ్వంసం - Pinnelli Destroy EVM
నరసరావుపేటలో అయితే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వేసి, కర్రలు చేతపట్టి దాడులకు దిగారు. కారంపూడిలో ఏకంగా ఇనుపరాడ్లు చేతపట్టుకుని ప్రధాన రహదారిపై పట్టపగలు వీరంగం వేశారు. వెనకుండి వారిని రెచ్చగొట్టిన నాయకులంతా ప్రస్తుతం హాయిగా ఏసీ గదుల్లో సేదతీరుతున్నారు. కానీ అమాయకులైన అనుచరణగణమంతా బలైంది. అప్పుడు రెచ్చగొట్టిన నేతలు నేడు మీకేం కాదని బాధిత యువతకు భరోసా ఇచ్చే పరిస్థితి కనపడటం లేదు. దీంతో అల్లర్ల కేసుల్లో ఇరుక్కున్నవారి తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు నాశనమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మెడకు కేసుల ఉచ్చు:పోలింగ్ రోజు, మరుసటి రోజు జరిగిన గొడవలపై ఈసీ సీరియస్‌గా స్పందించడంతో ప్రత్యేక దర్యాప్తు బృందం జిల్లాలో పర్యటించింది. సిట్ రాక ముందు చాలా స్టేషన్లలో కేసుల్లో పురోగతి లేదు. కొంతమందికే 41ఏ నోటీసులిచ్చి వదిలేశారు. సిట్ పర్యటించాక పోలింగ్ రోజున, మరుసటి రోజున జరిగిన అల్లర్ల వీడియోల సీసీ ఫుటేజీలను క్షుణ్నంగా పరిశీలించి, ఎవరెవరు పాల్గొన్నారో అందరిపై కేసులు పెట్టడం ముమ్మరం చేశారు. అంతేకాదు అంతకుముందు సాధారణ కేసులు పెట్టిన వారిపై తాజాగా 307 కేసులు పెడుతున్నారు. అప్పుడేదో ఉద్రేకంలో రాళ్లు, కర్రలు పట్టుకుని పరుగులు పెట్టామే కానీ కావాలని చేసింది కాదని యువత ఇప్పుడు బాధపడుతున్నారు.