Parents Died in House Collapse Incident Three Children Orphaned in Anantapur :ఇల్లు కూలిన ఘటనలో ముగ్గురు పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయారు. తల దాచుకునేందుకు నీడ లేక బంధువుల వద్ద ఆశ్రయం పొందుతున్నారు. అన్న కూలీ పనులు చేస్తూ తమ్ముడిని, దివ్యాంగురాలైన చెల్లిని పోషిస్తున్నాడు. దినదినం దుర్భర జీవనం గడుపుతున్నారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. మనసున్న దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు ఆ పిల్లలు.
అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం హావళిగి గ్రామానికి చెందిన మారెప్ప, లక్ష్మీ దంపతులకు అంజి, మానస, హేమంత్‌కుమార్ సంతానం. గత జులై 14న ఇల్లు కూలిన ఘటనలో దంపతులిద్దరూ మృతి చెందారు. పిల్లలు అనాథలుగా మారారు. అంజి స్థానికంగా రైస్ మిల్లులో హమాలీగా పని చేస్తూ దివ్యాంగురాలైన చెల్లెలు మానస, తొమ్మిదో తరగతి చదువుతున్న తమ్ముడు హేమంత్‌కుమార్‌ను పోషిస్తున్నాడు. ఇల్లు కూలిపోయి ఐదు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు.
ఇల్లు కూలిపోయి ఐదు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. ఇల్లు కూలిన రోజు, మరుసటి రోజు హడావుడి చేసిన అధికార యంత్రాంగం, ఆ తరువాత వారిని పట్టించుకోలేదు. వారు ఇల్లు నిర్మించుకునేందుకు, చదువులకు అవసరమైన చర్యలు చేపట్టిన పరిస్థితి లేదు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, సాయం అందించాలని పిల్లలు వేడుకుంటున్నారు. ఆదుకోవాలని స్థానికులు సైతం ప్రభుత్వ పెద్దలకు సూచిస్తున్నారు.