ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమలలోని ఈ పెయింటింగ్ ఏమిటో తెలుసా? - 90శాతం మంది భక్తులు ఫెయిల్! - VENGAMAMBA ANNADANA SATRAM PAINTING

తరిగొండ వెంగమాంబ అన్నదాన భవనంలో విశేషంగా ఆకర్షించే పెయింటింగ్ - భక్తుల సెల్ఫీలు

vengamamba_annadana_satram_painting
vengamamba_annadana_satram_painting (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 23, 2025, 1:21 PM IST

Vengamamba Annadana satram Painting :తిరుమల తిరుపతి అనగానే గుర్తొచ్చేది వేంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపం. ఆ తర్వాత ఆహ్లాదకరమైన ప్రకృతి వాతావరణం, ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు, జలపాతాలు. భక్త జనం నడక మెట్లలో చల్లగాలిని ఆస్వాదిస్తూ మైమరచిపోయి యాత్రను కొనసాగిస్తుంటారు. దారి మధ్యలో కనిపించి పలకరించే జింకలు, కోతులు, పక్షులు అనేకం. ఓ కొత్త లోకంలోకి వెళ్తున్న అనుభూతిని ఆస్వాదిస్తారు. ఇక వాహనాల్లో కొండపైకి వెళ్లే భక్తులు కొండచిలువను తలపించే రహదారిపై ప్రయాణాన్ని ఎంతో ఆస్వాదిస్తారు. మలుపు, మలుపులో ఎంతో అనుభూతి చెందుతారు. గోవింద నామ స్మరణలో కొండపైకి చేరుకుంటారు.

దర్శనం టికెట్ బుక్ చేసుకుని వెళ్లకపోతే మరో అవకాశం? - టీటీడీ ఈవో ఏమన్నారంటే!

తిరుమల చేరుకోగానే తలనీలాల కౌంటర్లు, విష్ణు పుష్కరిణి వద్ద ఎంతో కోలహలం ఉంటుంది. వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులంతా లడ్డూ ప్రసాదాల కోసం క్యూ కడుతుంటారు. ఆ తర్వాత వారి చూపంతా తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం వైపే ఉంటుంది. క్యూలైన్ల నుంచి సత్రంలోకి వెళ్లే ప్రతి భక్తుడిని ఓ పెయింటింగ్ విపరీతంగా ఆకర్షిస్తుంది. 'వావ్' అనిపించేలా చూసేందుకు రెండు కళ్లు కూడా సరిపోవు అనే భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. తిరుమలలో ఎక్కువ మంది ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేది ఇక్కడే. అయితే, ఆ పెయింటింగ్ ఏమిటనేది చాలా మంది భక్తులకు తెలియదు. చూసే వారంతా తిరుమల తిరుపతి మెట్ల మార్గంలా భావిస్తుంటారు. లేదంటే తిరుమల తిరుపతి ఏడు కొండలకు సంబంధించిన మ్యాప్ అని అనుకుంటుంటారు. కానీ, అదేం కాదు. ఆ పెయింటింగ్ దేనికి సంబంధించినదో మీకైనా తెలుసా? తెలుసుకుందాం పదండి.

శేషాచలం అడవులు, ఆ అడవుల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు సంబంధించిన మ్యాప్ అది. శేషాచలం అడవుల్లో ఐదు ప్రముఖ పుణ్యక్షేత్రాలున్నాయి. ఆ ఐదు క్షేత్రాలను ప్రతిబింబించే చిత్రం ఇది. ఆదిశేషు (పాము) పడగ నీడన శ్రీవేంకటేశ్వరుడు తోక భాగంలో ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం ఉంటాయి. మధ్యలో మరో మూడు క్షేత్రాలకూ పౌరాణిక నేపథ్యం ఉంది. ఆ వివరాలేమిటో తెలుసుకుందాం.

తిరుమల తిరుపతి గురించి, వేంకటేశ్వర స్వామి గురించి భక్తులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రీశైలం మల్లికార్జునస్వామి వారి ఆలయం భక్తులకు సుపరిచితమే. ఈ రెండింటి నడుమ మరో మూడు క్షేత్రాలున్నాయి. శ్రీశైలం నుంచి తిరుమల దిశగా మొదట త్రిపురాంతకం, ఆ తర్వాత మహానంది, అహోబిలం క్షేత్రాలు ఎంతో విశిష్టత కలిగిన క్షేత్రాలు. ఈ ఆలయాలన్నీ ఒకే మార్గంలో ఉండడం విశేషం.

త్రిపురాతకంలోని ఆలయం (ETV Bharat)

త్రిపురాంతకం :

త్రిపురాంతకం క్షేత్రం ప్రకాశం జిల్లాలో ఉంది. మార్కాపురం నుంచి ఇక్కడికి 42 కిలో మీటర్ల దూరం ఉంటుంది. పరమశివుడు త్రిపురాసురలను ఇక్కడే అంతం చేయడం వల్ల త్రిపురాంతకం అనే పేరు వచ్చినట్లు తెలుస్తోంది. కొండపై త్రిపురాంతకేశ్వరుడు, దిగువన వెలసిన అమ్మవారిని త్రిపుర సుందరీ దేవి అని పిలుస్తుంటారు. కొండపైన గుడి పక్కనే కనిపించే సొరంగ మార్గం శ్రీశైలం వరకు దారి తీస్తుందని పూర్వీకులు చెప్తుంటారు.

మహానంది ఆలయం, కోనేరు (ETV Bharat)

మహానంది :

నల్లమల కొండల తూర్పున నంద్యాల జిల్లాలోని మహానంది క్షేత్రం ఉంది. ఇక్కడికి 15 కిలోమీటర్ల పరిధిలో నవ నందులుగా పిలువబడే తొమ్మిది నంది పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఇందులో మహానంది మొదటిది. ఇక్కడి శివలింగంపై ఆవు గిట్ట ఉన్న ముద్రలు కనిపించడం విశేషం. ఇక్కడి కోనేరు ఎంతో అద్భుతమైన ప్రత్యేతకలు కలిగి ఉంది. ఇలాంటి పుష్కరిణి ప్రపంచంలో మరెక్కడా కనిపించకపోవడం గమనార్హం. పుష్కరిణిలో నీరు ఎంతో పారదర్శకంగా కనిపిస్తుంది. దాదాపు ఐదారు అడుగుల లోతు కలిగిన ఈ పుష్కరిణిలో చేపలు, భక్తులు వేసిన నాణేలు పైకి కనిపించడం విశేషం. నిరంతరం ప్రవహించే ఈ నీరు శివలింగం కింద నుంచి ఉబికి వస్తున్నట్లు పరిశోధకులు తేల్చారు. ఈ నీటితో వందల ఎకర్లాల్లో వ్యవసాయం చేస్తుండడం కొసమెరుపు.

అహోబిలంలోని నృసింహాలయం (ETV Bharat)

అహోబిలం :

నృసింహ స్వామి ఉక్కు స్తంభాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్యకశపుడిని సంహరించిన స్థానమిదేనని పూర్వీకులు చెప్తుంటారు. ఆయన చేతులు కడిగినందునే కోనేరులో నీరు చూడడానికి ఎరుపు రంగులో ఉంటుందని చెప్తుంటారు. నీటిని చేతిలోకి తీసుకుంటే మామూలుగా కనిపించడం విశేషం. కొండపై ఆరు, కింద మరో మూడు నృసింహాలయాలు ఉన్నాయి. గ్రహదోషాలున్న వారు నవ నారసింహులను దర్శించుకోవాలంటుంటారు.

చివరగా పెయింటింగ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం నుంచి కలియుగ వైకుంఠం తిరుమల వరకు చూపించిన మార్గమే ఇది. ఎంతో మహిమాన్విత ఐదు క్షేత్రాలను కలుపుతూ వేసిన ఈ పెయింటింగ్ చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.

టీటీడీ మెనూలో మరో వంటకం - సంతోషం వ్యక్తం చేస్తున్న భక్తులు

కాలినడక భక్తులకు కంకణాలు - 2, 3గంటల్లో శ్రీవారి దర్శనం!

ABOUT THE AUTHOR

...view details