Ongole Bulls are Facing Serious Difficulties : ప్రకాశం పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది ఒకటి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. మరొకటి జిల్లా అస్తిత్వానికి నిదర్శనంగా నిలుస్తూ వచ్చిన ఒంగోలు గిత్తలు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎంతో మేలైన పశువుల జాతి ఇది. వేగంగా పరుగులు తీయడం దూకుడుగా రంకెలు వేయడం రాజసానికి మారుపేరుగా నిలుస్తుంటాయి. అటువంటి జాతి సంరక్షణ, పరిరక్షణను గత పాలకులు విస్మరించారు. పశు ఉత్పత్తి క్షేత్రానికీ నిధులివ్వక ఆవులను తిండికీ ఎండగట్టారు. మూగ జీవుల వేదనను పట్టించుకోని నాటి పాలకుల కారణంగా బక్కచిక్కి పోయాయి.
టీడీపీ హయాంలో శ్రీకారం :ఒంగోలు గిత్తల సంరక్షణకు 2000లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు నాగులుప్పలపాడు మండలం చదలవాడలో పశు ఉత్పత్తి క్షేత్రాన్ని ఏర్పాటు చేయించారు. 2014-19 మధ్య టీడీపీ హయాంలోనే రాష్ట్రీయ గోకుల్ మిషన్ నుంచి రూ.ఆరు కోట్లు విడుదలయ్యాయి. ఆ నిధులతో పశువుల కోసం రేకుల షెడ్లు, క్షేత్రంలో రహదారులు, ఇతర నిర్మాణాలు చేపట్టారు. గోకుల్ మిషన్ నిధులతోనే కొత్తగా షెడ్లూ ఏర్పాటు చేస్తున్నారు.
అభివృద్ధి రంకె వేస్తున్న.. ఒంగోలు గిత్తల ఉత్పత్తి కేంద్రం!
పశువుల నోరు కట్టేసిన వైఎస్సార్సీపీ : 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ఈ క్షేత్రాన్ని పట్టించుకున్నది లేదు. తొలి ఏడాది రూ.31 లక్షలు, ఆ తర్వాత ఏటా రూ.20 లక్షలు, ఆలోపు నిధులే కేటాయించింది. సమీకృత దాణా కూడా లభించక పశువులు ఎముకల గూళ్లు తేలి బలహీనంగా మారాయి. నిధులు కేటాయించాలని కోరినా పట్టించుకున్న వారు లేకపోయారు. ఇక్కడి పశువుల కోసం ఖాళీ స్థలంలో నేపీయర్ తదితర గ్రాసాన్ని పెంచి పచ్చి మేతగా అందిస్తున్నారు. పోషకాహారం కోసం ప్రత్యేకంగా సమీకృత పశు దాణా దిగుమతి చేసుకుంటున్నారు. 45 రోజులకు సుమారు 25 టన్నులు, ఏడాదికి 200 టన్నులకు పైగా దాణా అవసరం. వైఎస్సార్సీపీ హయాంలో బడ్జెట్ తక్కువగా కేటాయించడంతో ఏటా వంద టన్నులే సరఫరా అయ్యేది. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోవడంతో నీళ్లు రాక మరోవైపు పచ్చిగడ్డికీ కొరత ఏర్పడింది. ఈ పరిస్థితులతో గత రెండేళ్లుగా మూగజీవాలు ఆకలితో అలమటించాయి.