NTR Bharosa Pensions Distribution: రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జరిగింది. నూతన సంవత్సరం కానుకగా ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు పింఛన్ సొమ్ము అందజేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కోలాహలంగా సాగింది. ఒకరోజు ముందుగానే పింఛన్ సొమ్ము పంపిణీ చేయాలన్న సీఎం ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 63,78,000 మందికి 2,717 కోట్ల రూపాయలను ప్రభుత్వం అందజేసింది. లబ్ధిదారుల ఇళ్లను జియో ట్యాగింగ్ చేసిన ప్రభుత్వం సిబ్బంది నేరుగా ఇంటివద్దకే వెళ్లి పింఛన్ సొమ్ము అందజేస్తున్నారా లేదా అన్నది పరిశీలించింది.
ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. నందిగామలో ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య, గుడివాడలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఇంటింటికీ తిరిగి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ జరిగింది. కనిగిరిలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తెల్లవారుజాము నుంచే అధికారులతో కలిసి వార్డుల్లో తిరిగి పింఛన్లు పంపిణీ చేశారు. ముండ్లమూరు మండలం పసుపుగల్లులో దర్శి టీడీపీ ఇన్‌ఛార్జి గొట్టిపాటి లక్ష్మి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు.
పింఛన్ పంపిణీ చేసి - కాఫీ కలిపి లబ్ధిదారులకు ఇచ్చిన చంద్రబాబు