No_Registration_to_House_Lands_in_Vijayawada No Registration to House Lands in Vijayawada: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భౌగోళికంగా కొండ ప్రాంతంలో ఎక్కువగా ఉంది. దశాబ్దాల కాలం నాటి నుంచి ప్రజలు కొండలపై నివాసాలు ఏర్పరుచుకుని జీవిస్తున్నారు. వారికి నాటి నుంచి నేటి వరకు విద్యుత్తు, తాగు నీరు, మెట్లు, రోడ్లు, రక్షణ గోడలు వంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. టీడీపీ హయాంలో కొండప్రాంతాల్లో నివసించే వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించి, బ్యాంకు రుణాలు పొందేలా చేస్తామని చెప్పారు. అందుకు నివాసితులు దరఖాస్తులు చేసుకున్నారు. అధికారులు సర్వే కూడా నిర్వహించారు.
అధికారంలోకి వచ్చి ఐదేళ్లు గడిచినా: ఈ లోగా ఎన్నికలు రావడంతో రిజిస్ట్రేషన్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల్లో వైసీపీ నాయకులు కొండ ప్రాంత నివాసితులకు పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి అయిదేళ్లు గడుస్తోంది. జగనన్న పట్టా పేరుతో ఎందుకు పనికి రానివి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇచ్చిన పట్టాపై ఇదిగో రిజిస్ట్రేషన్ చేస్తున్నామని ప్రజలకు ఆశలు కల్పించారు. తీరా నెరవేర్చలేదు. కొండప్రాంతంలో ఎప్పటి నుంచో నివాసం ఉంటున్నవారికి ఇచ్చిన ఇళ్ల పట్టా తీసుకుని బ్యాంకుల వద్దకు రుణం కోసం వెళ్తే రిజిస్ట్రేషన్ ఉంటేనే రుణాలు ఇస్తామని చెబుతున్నారు.
ముస్లింలకు మేలు చేసేది టీడీపీనే - వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి: చంద్రబాబు
పట్టా వరకే పరిమితం: అవసరాలకు ఇళ్లు తాకట్టు పెడదామన్నా అవకాశం లేకుండా పోయింది. పట్టా ఉన్నా లేకున్నా ఒకటే అనే పరిస్థితి తయారైంది. తమ ఇల్లు తమకు సొంతమయ్యేలా చేస్తామని గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరలేదని కొండ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయిదేళ్లు గడుస్తున్నా స్థలాల రిజిస్ట్రేషన్ ఊసేలేదని మండిపడుతున్నారు. పట్టా వరకే పరిమితం చేశారని, రిజిస్ట్రేషన్ల కోసం ఎదురు చూపులే మిగిలాయని వాపోతున్నారు.
హద్దులు లేకుండా అసమగ్రంగా: స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కొందరికి ఇచ్చిన పట్టాల్లో కనీసం ఇంటి హద్దులు కూడా పేర్కొనలేదని హద్దులు లేకుండా అసమగ్రంగా పట్టాలిస్తే ఏం ప్రయోజనమని స్థానికులు పెదవి విరుస్తున్నారు. గతంలో ప్రజా ప్రతినిధులు, అధికారులను రిజిస్ట్రేషన్ల విషయమై ప్రశ్నిస్తే అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చారని మండిపడుతున్నారు. పైసా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
బ్యాంకు రుణాలకి ఇబ్బందే : సమగ్ర వివరాలు, హక్కులు లేకుండా ఇచ్చిన పట్టాల వల్ల ఉపయోగం లేదని, ఆర్థిక అవసరాల నిమిత్తం ఇళ్లు తాకట్టు పెట్టుకుందామన్నా ఏ బ్యాంకులు రుణాలు ఇచ్చే పరిస్థితి లేదని స్థానికులు వాపోతున్నారు. కొండ ప్రాంతాల్లో ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కారం కాకుండానే మళ్లీ ఎన్నికలు వచ్చాయి. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించాలని స్థానికులు వేడుకుంటున్నారు.
అధికారుల కళ్లకు గంతలు- వైసీపీ వ్యూహంతో ఓటర్లకు ఊహించని తాయిలాలు