People Hope on Alliance Government: పట్టణాలు, నగరాలను ఆధునీకరించేందుకు 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. 2016లో ఎంపిక చేసిన పట్టణాలు, నగరాల్లో స్మార్ట్ సిటీ పథకం అమలు చేసింది. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడం, ఆధునిక టెక్నాలజీతో అభివృద్ధి చేయడం కోసం ఈ పథకం కింద కొన్ని నగరాలకు కేంద్రం నిధులు సమకూర్చగా, మరికొన్నింటికి రాష్ట్ర ప్రభుత్వమే నిధులు కేటాయించింది. అందులో భాగంగా ఒంగోలులో అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం 8 కోట్ల రూపాయలు విడుదల చేసింది.
నిధుల వినియోగానికి కలెక్టర్, ఎస్సీ, కమిషనర్, పట్టణ ప్రణాళిక అధికారి, ఆర్డీవో, పురపాలక రీజనల్ డైరెక్టర్తో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ చేసిన తీర్మానాలకు అనుగుణంగా పనులు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇందులో 4 కోట్లతో మెప్మా భవన్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించారు. దీని ద్వారా నగరంలోని పబ్లిక్ అడ్రస్ సిస్టం, జియోట్యాగింగ్ ద్వారా తాగు నీటి ట్యాంకర్లు సరఫరా, వీధి దీపాల నిర్వహణ, ట్రాఫిక్ కంట్రోల్ సిస్టంలను అనుసందానం చేశారు.
తుపాన్ల సమయంలో ఏకకాలంలో ప్రజల్ని అప్రమత్తం చేయడానికి పబ్లిక్ ఆడ్రస్ సిస్టం ఉపయోగపడుతుంది. స్మార్ట్ సిటీ ప్రతిపాదనల్లో ట్రంక్‌రోడ్డును ఆదర్శ మార్గంగా తీర్చిదిద్దాలని ప్రతిపాదించారు. ఆ మార్గంలో ఇరువైపులా ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేయడం, వీధి వ్యాపారులకు నిర్ణీత స్థలం కేటాయించడం, లైటింగ్‌లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దటం లాంటి పనులకు 3 కోట్లతో చేపట్టాలని నిర్ణయించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఈ పనులన్నీ అటకెక్కాయి. గత ఐదేళ్లలో కనీసం మౌలిక సదుపాయలు కల్పించలేదని నగరవాసులు మండిపడుతున్నారు.