New Railway Line Connectivity to Amaravati :రాజధాని అమరావతి మీదుగా ఎర్రుపాలెం- నంబూరు మధ్య కొత్త రైల్వే లైన్ పనులు నాలుగేళ్లలో పూర్తి చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. 56 కి.మీ. మేర నిర్మించే ఈ ప్రాజెక్టుకు రూ.2,545 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేసినట్లు వెల్లడించారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీలోని రైల్వే ప్రాజెక్టులకు మంజూరైన నిధులు, ఇతర వివరాలను సికింద్రాబాద్‌లో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్, విజయవాడలో డీఆర్‌ఎం నరేంద్ర ఎ.పాటిల్ వేర్వేరుగా సోమవారం విలేకరులకు వెల్లడించారు.
ఏపీలోని వివిధ ప్రాజెక్టుల నిర్మాణానికి భూసేకరణలో జాప్యమయ్యేదని, సీఎం చంద్రబాబు వివిధ శాఖలతో ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్ వల్ల సమన్వయ సమావేశాలు నిర్వహించి, సమస్యలు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. భూసేకరణ త్వరగా పూర్తయితే పనుల్లో వేగం పెరుగుతుందని చెప్పారు.
ఇంకా ఏమన్నారంటే
- గతేడాది బడ్జెట్‌లో ఏపీకి రూ.9,151 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.9,417 కోట్లకు పెంచారు.
- రైలు ప్రమాదాలు నివారించే కవచ్ వ్యవస్థను కర్నూలు- గుంతకల్లు మార్గంలోని 122 కి.మీ. మేర అందుబాటులోకి తెచ్చాం.
- బల్హార్ష- విజయవాడ మార్గంలో ఏపీ పరిధిలో 36 కి.మీ, విజయవాడ- గూడూరు మధ్య 293 కి.మీ, నల్వార్- గుంతకల్లు- ఎర్రగుంట్ల- రేణిగుంట మార్గంలో 401 కి.మీ, విజయవాడ- దువ్వాడ మధ్య 330 కి.మీ. పరిధిలో కవచ్ ఏర్పాటు పనులు వివిధ దశల్లో ఉన్నాయి.
- నడికుడి నుంచి శ్రీకాళహస్తి మార్గంలో 70 కి.మీ. ట్రాక్ నిర్మాణం పూర్తయ్యింది. ఇది కనిగిరి వరకు పూర్తయితే రైళ్లు నడపాలని భావిస్తున్నాం.
- గుంటూరు నుంచి సికింద్రాబాద్ మధ్య డబ్లింగ్ పూర్తయితే వందేభారత్ సహా మరిన్ని రైళ్లు నడిపేందుకు వీలుంటుంది.
- కడప- బెంగళూరు మార్గం ఎలైన్‌మెంట్‌లో మార్పులేదు. రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించకపోవడం, భూసేకరణ పూర్తి చేయకపోవడంతో ఈ ప్రాజెక్టు పనుల్లో పురోగతి లేదు.