Polavaram New Diaphragm Wall Works : ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద నూతన డయాఫ్రం వాల్ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. గత వైఎస్సార్సీపీ హయాంలో ప్రాజెక్టు పనులు నిలిచిపోగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించిన పనులను ఇవాళ కాంట్రాక్టు సంస్థ ప్రారంభించింది.
ఇందులో భాగంగా ఉదయం 10:19 గంటలకు కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను జలవనరుల శాఖ అధికారులు ప్రారంభించారు. ముందుగా ప్రాజెక్టు ప్రాంతంలో లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. అనంతరం భారీ యంత్రాలకు పూజలు చేశారు. పనులను బావర్ కంపెనీ ప్రతినిధులు ప్రారంభించగా ఇరిగేషన్ అధికారులు సమీక్షించారు. ఈ నిర్మాణం కోసం ప్లాస్టిక్ కాంక్రీట్-టీ5 మిశ్రమాన్ని వినియోగించనున్నారు. కనిష్ఠంగా 20 మీటర్లు, గరిష్ఠంగా 94 మీటర్ల లోతు నుంచి నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం 3 ట్రెంచ్ కట్టర్లు, 3 భారీ గ్రాబర్లు, 3 డిశాండింగ్ యూనిట్లు వంటి భారీ యంత్రాలను జర్మనీ నుంచి తెప్పించారు.
మరోవైపు 1.396 కిలోమీటర్ల పొడవైన డయాఫ్రం వాల్ నిర్మాణం కోసం ప్రణాళికలు రూపొందించారు. 1.5 మీటర్ల మందంతో నది ప్రవాహ మార్గంలో భూమి లోపల దీని నిర్మాణం చేపట్టనున్నారు. సగం నిర్మాణం పూర్తి కాగానే సమాంతరంగా దాని పైన ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ షెడ్యూల్ జారీ చేసింది. కొత్త డయాఫ్రం వాల్ కోసం రూ.990 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. నిర్దేశించిన లక్ష్యానికి ముందుగానే దీని నిర్మాణం పూర్తి చేస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.