NDA Government Issue New Ration Cards 2024 :రాష్ట్రంలో రేషన్ కార్డులు కొత్త డిజైన్లతో అందుబాటులోకి రానున్నాయి. గతంలో జగన్ చిత్రాలతో ముద్రించిన రేషన్ కార్డుల స్థానంలో కొత్త సాంకేతికత జోడించి కార్డులు ముద్రించి ఉచితంగా అందజేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తాజా సమీక్షలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ మేరకు త్వరలో తీసుకొస్తామని వెల్లడించారు. ఇందుకు ఆ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్ వ్యవస్థ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. అర్హులందరికీ పోర్టిఫైడ్ బియ్యం అందజేస్తోంది. ఈ రకం బియ్యంతో ఐరన్ లోపం నివారణకు ఆస్కారం కలుగుతోంది. అదే విధంగా కార్డుల ఆధునికంగా తయారు చేసి పేదలకు ఇవ్వాలన్న సంకల్పం కాగా ఇవన్నీ మున్ముందు ఏర్పాటు చేయబోయే రైస్ ఏటీఎంలకు అనుసంధానంగా తీర్చిదిద్దనున్నారు.
రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్న్యూస్ - నేటి నుంచి నాలుగు వస్తువులు సరఫరా
ఆహార భద్రత చట్టానికి అనుగుణంగా :జగన్ సర్కార్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేయడంలో ఆలస్యం చేసింది. కొత్త కార్డులకు 6 నెలలు ఆగాల్సిన దుస్థితి కాగా కూటమి ప్రభుత్వం కొత్త జంటలకు వెంటనే కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇదే తీరుగా ఆహార భద్రత చట్టం 2013 అమలు మేరకు కార్డులు అందించాల్సి ఉంది. ఇందుకు గతంలో వైఎస్, జగన్ చిత్రాలతో కార్డులు ఉండగా వాటిని తొలగించనుంది.