Anantha Horticulture Conclave-2025 In Ananthapur: ఉద్యాన పంటల రైతులకు ప్రయోజనం చేకూర్చేలా రాష్ట్రంలో తొలిసారిగా అనంతపురంలో జాతీయస్థాయి సదస్సు జరిగింది. ఉద్యాన పంటలు సాగుచేసే రైతులకు నాణ్యమైన దిగుబడి సాధించడానికి సాంకేతిక తోడ్పాటుతో పండించిన ఉత్పత్తిని మంచి ధరకు విక్రయించే మార్కెటింగ్ సౌకర్యం కల్పించేలా ఈ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు వచ్చిన కంపెనీల్లో తొలి ప్రాధాన్యతగా రాష్ట్రానికి చెందిన ఏడు సంస్థలతో ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది. ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా కేవలం రైతులకు ఆర్థిక ప్రయోజనం, కంపెనీలకు నాణ్యమైన ఉద్యాన పంటల ఉత్పత్తులు అందించేలా ఈ ఒప్పందం చేసుకున్నారు.
ఉద్యాన రైతుల కోసం జాతీయస్థాయి సదస్సు:అనంతపురంలో'అనంత హార్టికల్చర్ కాన్ క్లేవ్-2025' పేరిట తొలిసారిగా జాతీయస్థాయి సదస్సు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా నాణ్యమైన పండ్లు, కూరగాయలు సాగుచేస్తున్న రైతులను సదస్సుకు ఆహ్వానించి వారి ఉత్పత్తులకు మంచి ధర ఇప్పించే ప్రముఖ సంస్థలను పిలిపించారు. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలతో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అనంత హార్టికల్చర్ కన్ క్లేవ్ను నిర్వహించారు. దేశవ్యాప్తంగా రైతులకు వివిధ రకాల సేవలు అందిస్తున్న 104 కంపెనీల ప్రతినిధులు ఈ సదస్సుకు వచ్చారు. జిల్లాలో రైతుల నుంచి ఉద్యాన పంటల ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని ఆయా సంస్థల ప్రతినిధులకు తెలియజేశారు.
7 కంపెనీల ప్రతినిధులతో ఎంవోయూ: సాగుకు అవసరమైన డ్రిప్, స్ప్రింక్లర్ , యంత్ర పరికరాలు ప్రభుత్వం రాయితీతో ఇస్తుందని లఘు చిత్ర ప్రదర్శన ద్వారా చెప్పారు. ఏడు కంపెనీల ప్రతినిధులు తమ సంస్థల ద్వారా సేవలందించడానికి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వం అనుకూలంగా ఉన్నందున తాము రైతులతో కలిసి పనిచేయడానికి ఎంవోయూ చేసుకున్నట్లు ఆయా సంస్థల ప్రతినిధులు చెప్పారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ హాజరై ప్రభుత్వం రైతులకు అందిస్తున్న రాయితీలను కంపెనీల ప్రతినిధులకు వివరించారు.
రెండు నెలల్లో క్షేత్రస్థాయిలో సేవలు: ప్రకృతి ఎన్ని సార్లు నష్టపరిచినా ఎదురునిలిచి దిగుబడులు సాధిస్తున్న అనంతపురం రైతుల గురించి ప్రపంచానికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఈ సందర్భంగా అన్నారు. బ్రాండ్ అనేది ప్రతి వస్తువుకు అవసరమని ఏపీకి బ్రాండ్ సీఎం చంద్రబాబు మాత్రమేనని ఆయన ఉద్ఙాటించారు. ఏడాది లోపే హంద్రీనీవా కాలువ వెడల్పు పనులు పూర్తి చేస్తామని పయ్యావుల కేశవ్ రైతులకు హామీ ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చాలా చేస్తోందని, అనంతపురం జిల్లాలో నీటి పారుదల వ్యవస్థ ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరివ్వడమే తమ లక్ష్యమని రైతులకు, కంపెనీల ప్రతినిధులకు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రైతులకు డ్రిప్ పరికరాలు కూడా ఇవ్వలేకపోయిందని పయ్యావుల ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఎంవోయూ చేసుకున్న ఏడు సంస్థల ప్రతినిధులు మరో రెండు నెలల్లో క్షేత్రస్థాయికి వెళ్లి సేవలు ప్రారంభించనున్నారని ఆయన వెల్లడించారు. తొలుత అరటి నార నుంచి వస్త్రాలు తయారు చేసే పరిశ్రమ ఏర్పాటుకు శిక్షణ ప్రారంభం కానుందని అధికారులు తెలియజేశారు.