National Highway Expansion Works Delay in Palnadu District : నిత్యం వందలాది వాహనాలు రయ్‌మంటూ దూసుకెళ్లే అత్యంత రద్దీ రహదారి అది. జిల్లా కేంద్రాన్ని గ్రామాలు, పట్టణాలతో అనుసంధానం చేసే ఈ రోడ్డు రద్దీకి అనుగుణంగా విస్తరణ చేపట్టకపోవడంతో ప్రమాదం జరగని రోజు లేదు. కనీసం మార్జిన్లు మరమ్మతులు చేయకపోవడంతో వాహనాలు బోల్తాకొట్టి ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికైనా సమస్యలను అధిగమించి రోడ్డు విస్తరణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
అడ్డంకిగా భూసేకరణ : పల్నాడు జిల్లాలో నరసరావుపేట-చిలకలూరిపేట పట్టణాలను కలిపే కీలక రహదారిలో నిత్యం వేలాది వాహనాలు ఆ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటాయి. అడుగడుగునా మలుపులు, కొన్నిచోట్ల లోతైన గుంతలతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. తెలుగురాష్ట్రాల అనుసంధానించేలా జాతీయ రహదారుల్ని అభివృద్ధి చేసే క్రమంలో కేంద్రం ఈ రహదారిని వాడరేవు-పిడుగురాళ్ల జాతీయ రహదారిగా ప్రకటించింది. నిధులు కేటాయించినా నిర్మాణం విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. బాపట్ల జిల్లా పరిధిలో భూసేకరణ పూర్తయి పనులు జరుగుతున్నా పల్నాడు జిల్లాలో భూసేకరణ కొలిక్కిరాక పనులు ప్రారంభం కాలేదు .
హంద్రీ వంతెనపై భారీ గొయ్యి - వాహనదారులు ఆందోళన - Handri bridge
కేంద్ర నిధులు మంజూరు చేసిన జాప్యం : మొత్తం 85 కిలోమీటర్ల రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించి అభివృద్ధి చేయడానికి కేంద్రం రూ.1851 కోట్లు కేటాయించింది. వాడరేవు నుంచి చిలకలూరిపేట వరకు ఒక ప్యాకేజీగా విభజించారు. చిలకలూరిపేట నుంచి నకరికల్లు అడ్డరోడ్డు వరకు మరో ప్యాకేజీగా నిధులు కేటాయించారు. తొలి ప్యాకేజీ కింద బాపట్ల జిల్లాలో పనులు మొదలై జరుగుతున్నాయి. కానీ రెండో ప్యాకేజి నరసరావుపేట బైపాస్‌కు సంబంధించి 70 హెక్టార్ల భూ సేకరణలో జాప్యం కారణంగా పనులు మొదలుపెట్టలేదు. గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ఇరుకు రోడ్డులో తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా చిలకలూరిపేట-నరసరావుపేట మధ్య 20 కిలోమీటర్ల పరిధిలో సమస్య ఎక్కువగా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు.