Illegal Constructions Demolition in Machilipatnam : ఏపీలో బుల్డోజర్ల హవా నడుస్తోంది. గత ప్రభుత్వంలో చెరువులు, కుంటల్లోని అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా మచిలీపట్నం మూడు స్థంభాల సెంటర్ సమీపంలో జాతీయ రహదారి వెంట మడుగు పోరంబోకు భూమిలో అక్రమంగా నిర్మించిన ఇండ్ల కూల్చివేతను నగరపాలక సంస్థ అధికారులు చేపట్టారు.
భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేత పనులు జరుగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అనుమతిలేని 180 ఇండ్లను పోరంబోకు భూమిలో నిర్మించారు. పది రోజుల కిందట అందులో నివసిస్తున్న వారికి అధికారులు నోటీసులు అందజేశారు. ఈ క్రమంలోనే విద్యుత్ కనెక్షన్లను తొలగించి కూల్చివేత పనులను ప్రారంభించారు. మడుగు పోరంబోకు భూమిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి.
Demolish Illegal Construction in AP :అయినా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసిందని అధికారులు తెలిపారు. మరోవైపు ఇండ్ల కూల్చివేతపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రి జేసీబీలు తెచ్చి ఇళ్లు కూల్చి తమను రోడ్డుపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ అధికారులు చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.