BJP MP Purandeswari on Ambedkar: అంబేడ్కర్‌ను అత్యధికంగా గౌరవించిన పార్టీ బీజేపీ అని రాజమహేంద్రవరం ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. అలాంటి రాజ్యాంగాన్ని తాము మారుస్తామంటూ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని, అంబేడ్కర్‌ను BJP ఎప్పుడూ అగౌరవపరచదని చెప్పారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ బీఅర్ అంబేడ్కర్‌ను అన్నివిధాలా అవమానపరిచింది కాంగ్రెస్సేనని పురందేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ పురందేశ్వరి మాట్లాడారు.
రాజ్యాంగాన్ని బీజేపీ ఎప్పుడూ ఉల్లంఘించలేదు: బాబాసాహెబ్‌ను రెండు సార్లు ఎన్నికల్లో ఓడించి పార్లమెంట్లో అడుగు పెట్టకుండా ఆయన్ను మానసికంగా క్షోభకు గురిచేశారని అన్నారు. అంబేడ్కర్ తమ నాయకుడని చెబుతున్న కాంగ్రెస్ ఎందుకు భారతరత్న ఇవ్వలేదని పురందేశ్వరి ప్రశ్నించారు. వాజ్‌పేయీ హయాంలో అంబేడ్కర్‌కు భారతరత్న ఇచ్చిన ఘనత బీజేపీదే అని గుర్తు చేశారు. రాజ్యాంగం, అంబేడ్కర్‌ను బీజేపీ ఎప్పుడు అగౌరవపరచదని తెలిపారు. అన్నివిధాలా అంబేడ్కర్‌ను అవమానపరిచింది కాంగ్రెస్సేనని తేల్చిచెప్పారు. రాజ్యాంగాన్ని బీజేపీ ఎప్పుడూ ఉల్లంఘించలేదన్నారు.
పోలీసుల రక్షణ సరిగ్గా లేదు: ఆర్టికల్ 356ని 134 సార్లు విధిస్తే వందసార్లు కాంగ్రెస్సే దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. తన తండ్రి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూడా కాంగ్రెస్ రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధివిధానాలు రూపొందించి పార్లమెంటులో జమిలి బిల్లు పెడతారని అన్నారు. అల్లు అర్జున్ విషయంలో విచారణ జరిగాక యాక్షన్ అనేది ఉంటుందని తెలిపారు. ఘటనాస్థలిలో పోలీసుల రక్షణ సరిగ్గా లేదని తెలుస్తోందని వ్యాఖ్యానించారు. పోలీసుల మరింత బందోబస్తు ఏర్పాటు చేస్తే బాగుండేదని అన్నారు.