Most Talented Chess Player From Vijayawada:కృషి, పట్టుదలకు తోడు నిరంతర సాధనతో ఎలాంటి లక్ష్యాలనైనా సాధించవచ్చని నిరూపిస్తున్నాడు విజయవాడకు చెందిన చదరంగం క్రీడాకారుడు. కోచ్ శిక్షణ, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో చదరంగం క్రీడలో దూసుకుపోతున్నాడు. గ్రాండ్ మాస్టర్ కావాలన్న తన లక్ష్య ఛేదన కోసం నిరంతరం సాధన చేస్తున్నాడు.
విజయవాడలోని సీతారాంపురానికి చెందిన శివప్రసాద్, ఉమాల ఏకైక కుమారుడు జూలూరు అక్షిత్ కుమార్. చదరంగంలో చిన్నప్పటి నుంచే మెలకువలు నేర్చుకున్నాడు. 2009లో గ్లోబల్ చెస్ అకాడమీ శిక్షణ శిబిరంలో చేరిన అక్షిత్ అనతి కాలంలోనే చదరంగంలో ప్రావీణ్యం సంపాధించాడు. యూరప్ సహా ఇప్పటివరకు 11 దేశాల్లోని వివిధ టోర్నీల్లో పాల్గొని తన "ఎలో" రేటింగ్‌ను గణనీయంగా మెరుగుపర్చుకున్నాడు.
నలంద విద్యానికేతన్‌లో పాఠశాల విద్యను అభ్యసించిన అక్షిత్ చదువులోనూ భేష్ అనిపించుకున్నాడు. పదో తరగతిలో 95 శాతం మార్కులు సాధించాడు. చదువుతోపాటు చదరంగంలో విశేషంగా రాణిస్తున్న ఈ యువకుడికి పీబీ సిద్ధార్థ కళాశాల యాజమాన్యం అండగా నిలిచింది. చదరంగం పోటీలకు ఐరోపా వెళ్లేందుకు 2 లక్షల రూపాయల ఆర్థికసాయం చేసింది. ఒకప్పుడు ఖాసీం శిక్షణ అందించగా ఇప్పుడు ఒడిశాకు చెందిన దేబాసిస్ దాస్ ఆధ్వర్యంలో అక్షిత్ శిక్షణ అందుకుంటున్నాడు.
ఎంబీబీఎస్, పీజీ కోర్సుల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులు- గవర్నర్ చేతుల మీదుగా బంగారు పతకాలు
సాధన ప్రారంభించిన నాలుగు నెలలకే జిల్లాస్థాయి అండర్-17 చదరంగం ఛాంపియన్ షిప్ పోటీల్లో విజేతగా నిలిచాడు అక్షిత్. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. అంచెలంచెలుగా ఎదిగి న్యూఢిల్లీలో జరిగిన అఖిల భారత స్కూల్స్ చెస్ ఓపెన్ ఛాంపియన్ షిప్లో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. చదరంగానికి దేశంలో మంచి ఆదరణ ఉందని క్రీడాకారులకు మంచి సహకారం అందుతుందని చెబుతున్నాడు.
హైదరాబాదులో ఆలిండియా ఫిడే రేటింగ్ చెస్ టోర్నీలో పసిడి పతకాన్ని సాధించాడు ఈ యువకుడు. 2012లో కామన్వెల్త్ చెస్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఓపెన్ కేటగిరీలో పాల్గొని, ఆసియా స్కూల్ చెస్ ఛాంపియన్ షిప్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. చెన్నైలో 2011లో కేసీఎఫ్ ఫిడే ఇంటర్నేషనల్ రేటింగ్ టోర్నీలో కేటగిరీలో పసిడి పతకాన్ని అందుకున్నాడు.