Moksha Yatra to Kashi :హిందూ మతంలో అత్యంత పవిత్రమైన నగరాల్లో కాశీ ఒకటి. అందుకే భక్తులు ఇక్కడికి యాత్రను నిర్వహిస్తారు. ఇది ముక్తి (మోక్షం) సాధించడానికి వీలును కల్పిస్తుంది. ఈ తీర్థయాత్ర ప్రాముఖ్యత గురించి స్కాంద పురాణంలో వివరించారు. కాశీలోని విశ్వనాథ్ ఆలయం పరమేశ్వరుడికి అంకితం చేయబడిన అత్యంత పవిత్ర స్థలాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఎవరైనా బతుకుదెరువు కోసం కన్న ఊరిని విడిచి మరో ప్రాంతానికి వెళ్తారు. కానీ చాలామంది కాశీలో మరణిస్తే బాగుండని అనుకుంటారు.
అయితే దీని వెనక పురాణ గాథలు దాగి ఉన్నాయి. జీవితం మలిదశలో కాశీలో మరణించాలి, లేదంటే పుత్ర సన్నిధిలో మరణించాలి అన్నది పెద్దల మాట. ఈ రెండూ మోక్షదాయకాలని విశ్వసిస్తారు. కాశీ పరమశివుడికి ప్రీతిపాత్రమైంది. పురాణకథను అనుసరించి కాశీదేవిగా విరాజిల్లుతున్న ఈ నగరానికి స్వతంత్ర బుద్ధిని ప్రసాదించాడు పరమేశ్వరుడు. అలా చైతన్యాన్ని పొందిన కాశీదేవి మూడు కోరికలు కోరింది.
పరిపూర్ణ విశ్వాసంతో కాశీకి వచ్చి గంగానదిలో స్నానం ఆచరిస్తారో వారి పాపాలు అన్నీ నశించాలనేది మొదటిది. కాశీలో ఎవరు ఎలా మరణించినా వారికి ముక్తి లభించాలనేది రెండోది. కాశీలోని మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్లలో దహనం చేసిన దేహాలకు ముక్తి లభించాలన్నది మూడోది. పరమేశ్వరుడు అలాగేనని అనుగ్రహించాడు. అది పార్వతీదేవికి నచ్చలేదు.
‘మహాదేవా! కాశీదేవికి అనవసరంగా వరాలిచ్చి ముక్తిని, ఆత్మజ్ఞానాన్ని చులకన చేశారని అనిపిస్తోంది. ఇకపై అందరూ చాలా తేలికగా ముక్తిని పొందగలుగుతారు కదా?!’ అంది. అందుకు శివుడు నవ్వి, ‘పార్వతీ! నీకు వాస్తవం చూపిస్తాను, పదా’ అంటూ కాశీకి తీసుకువెళ్లాడు. ఇంతలో మహాదేవుడు కాశీదేవికి ఇచ్చిన వరం ప్రాచుర్యం కావడం వల్ల వేలాది ప్రజలు గంగా స్నానం చేసేందుకు తరలివస్తున్నారు. పరమేశ్వరుడు పార్వతీ సహితంగా కాశీలో గంగా తీరానికి చేరుకుని ‘ఇప్పుడు మనిద్దరం మనుషులుగా మారదాం! నేను చనిపోయినట్లు పడుకుంటాను. నువ్వు వితంతువులా నటించి, దుఃఖిస్తూ- పాపరహితులైనవారు ఎవరైనా నా భర్తను తాకితే ఆయనకు తిరిగి జీవం వస్తుంది. పాపాత్ములు అయితే మాత్రం నా భర్తను తాకగానే తలపగిలి మరణిస్తారని చెప్పు’ అన్నాడు.