MLA Dhulipalla Narendra Kumar on Ponguleti Comments : అమరావతిపై తెలంగాణ మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలను టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఖండించారు. అమరావతి 'న భూతో న భవిష్యతి' అన్నట్లు అభివృద్ధి చెందబోతుందనేది సత్యమని అన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక అమరావతితో పాటు అన్ని ప్రాంతాలు అభివృద్ధికి నాందిపలికాయని పేర్కొన్నారు.
తెలంగాణా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ వ్యాఖ్యలు హాస్యాస్పదం, ఉద్దేశ్యపూర్వకం అని మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి అనుంగులు చేసే వ్యాఖ్యలనే ఇప్పుడు పొంగులేటి చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ మోహన్ రెడ్డి మిత్రత్వం వాసనలు ఇంకా పోలేదా అని ఎద్దేవా చేశారు. గడిచిన ఆరు నెలల్లో ఆంధ్రాకు వచ్చిన పెట్టుబడులు చంద్రబాబు దార్శనికతకు, అమరావతి ప్రగతికి నిదర్శనాలు అని ధూళిపాళ్ల అన్నారు.
ఇంతకీ తెలంగాణ మంత్రి పొంగులేటి ఏం అన్నారంటే: చంద్రబాబు రాగానే అమరావతికి తరలిపోతున్నాయనేది ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం మాత్రమేనని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అదే విధంగా ఇటీవల వరదల కారణంగా అమరావతి ఇన్వెస్షర్లలో భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్‌కు పెట్టుబడులు ప్రవాహంలా తరలివస్తున్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు.
హైడ్రాపై ప్రజల్లో భయం లేదు: అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ, హైడ్రా భయం ప్రజల్లో లేదని తెలిపారు. దాని గురించి తప్పుడు ప్రచారం జరిగినా, ఇప్పుడు నిజం తెలిసిందన్నారు. రాష్ట్ర అప్పులపై బీఆర్‌ఎస్, కేటీఆర్ నిజాలు తెలుసుకోవాలని అన్నారు. కార్పొరేషన్ పేరుతో చేసే అప్పులు సైతం ప్రభుత్వ ఖాతాలోకి వస్తాయనే విషయం కేటీఆర్ తెలుసుకోవాలని సూచించారు.
అదానీ విషయంలో జాతీయ పాలసీనే: ఏడు లక్షల 20 వేల కోట్ల తెలంగాణ రాష్ట్రానికి అప్పులు ఉన్నాయని పొంగులేటి పేర్కొన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా కొట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అయనతో కూర్చొని మాట్లాడే కోరిక తనకు వ్యక్తిగతంగా ఉందన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఆదాయం పెరుగుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఏడాది కాలంపై ఎలాంటి వ్యతిరేకత లేదని, వైఎస్‌ఆర్ సమయంలో కూడా ఇలాగే ప్రచారం జరిగిందని పొంగులేటి గుర్తు చేశారు. రెండు మూడేళ్లలో అన్ని సర్దుకున్నాయని, వర్షాలు బాగా పడ్డాయని తెలిపారు. అదానీ విషయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ పాలసీనే రాష్ట్రంలో అమలు జరుగుతుందని వివరించారు.
ఇక జెట్ స్పీడ్‌లో అమరావతి పనులు - రాజధానిలో మరో రూ.24,276 కోట్ల పనులకు ఆమోదం
103 ఎకరాల్లో ఏపీ అసెంబ్లీ భవనం - రూ.45 వేల 249 కోట్ల పనులకు సీఆర్‌డీఏ ఆమోదం