కొత్త ఓటరు జాబితాలోనూ అదే నిర్లక్ష్యం - అవే పాత తప్పులు! Mistakes in AP Voter List 2024 :నెల్లూరు జిల్లాలో మొత్తం 2.01 లక్షల ఫారం-7 దరఖాస్తులు అందితే వాటిలో 1.24 లక్షలనే ఆమోదించారు. కొన్నింటిని తిరస్కరించగా మరికొన్ని ఇప్పటికీ పరిశీలనలోనే ఉన్నాయి. అధికారులు మాత్రం పరిష్కరించామనే చెబుతున్నారు. మరోవైపు తుది జాబితాలోనూ అనేక తప్పులు చోటుచేసుకోవడంపై రాజకీయ పక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వరికుంటపాడు మండలంలో 83వ నంబరు బూత్‌లో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారి ఓట్లు తొలగించాలని దాదాపు 27 అర్జీలు పెట్టినా కనీసం పరిశీలించలేదు. అధికార పార్టీ వారు పెట్టిన సుమారు 34 అర్జీల్లో 25 మంది ఓట్లు తొలగించారని టీడీపీకి చెందిన ఎం.వి.శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేయడం పరిస్థితికి అద్దం పట్టింది.
ఆత్మలకూ చోటు :నెల్లూరు నగరంలోని 238, 239 పోలింగ్ బూత్‌ల్లో ఆత్మలకూ చోటు కల్పించారు. 238 బూత్‌లో ఎపిక్ నంబరు ZAF2333847లోని E.నాగేశ్వరరావు చనిపోయి ఆరేళ్లవుతోంది. అలాగే, ZAF2123669 సరస్వతి అనే మహిళ చనిపోయి అయిదేళ్లవుతున్నా బూత్ నంబరు 238, 239ల్లో రెండు చోట్లా ఓటు ఉండటం గమనార్హం. 239 బూత్‌లోనే సీరియల్ నంబరు 1251, 526 లో జీ.వెంకటకృష్ణారెడ్డి, శశిథర్‌లు సైతం మృతులే. వీరి పేర్లు తుది ఓటరు జాబితాలో ఉన్నాయి.
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 52 వేల బోగస్ ఓట్లు - తుది జాబితాలో సరిదిద్దుతామన్న కలెక్టర్
ఇంట్లో లేని వారి ఓట్లు నమోదు : నెల్లూరు రూరల్ మండలంలోని ఓటరు జాబితాలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. బీవీ నగర్‌లోని ఇంటి నంబరు 26-13-342లో లక్ష్మీ నరసయ్య, విజయలక్ష్మి దంపతులు ఉంటున్నారు. వీరు ఎన్నో ఏళ్లుగా అదే ఇంట్లో ఉంటున్నా తాజా జాబితాలో వారిలో ఒకరి పేరు కనిపించడం లేదు. ఇదే ఇంట్లో మరో తొమ్మిది కొత్త ఓట్లు నమోదవడం వారిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఇంటి పేరు కత్తెర : సాధారణంగా గ్రామంలో ఓ వ్యక్తిని గుర్తించడానికి వీలుపడేది ఇంటి పేరే. వెంకటాచలం మండలంలోని ఓటర్ల జాబితాలో ఇంటి పేర్లు లేకుండా పలు ఓట్లు కనిపిస్తున్నాయి. 198 పోలింగ్ బూత్‌లో సీరియల్ నంబరు 86, 79, 88ల్లో ఓటర్ల పేర్లకు ఇంటి పేర్లు లేవు. ఇలా దాదాపు పది మంది ఉన్నారు. వింజమూరుకు చెందిన రమేశ్ అనే యువకుడి ఓటు జాబితాలో ఉంది. ఆయన తండ్రి పేరు తప్పుగా నమోదైంది. అడుసుమల్లి మాలకొండయ్య అని ఉండాల్సిన చోట పల్లావోలు రమణయ్య అని పడటం గమనార్హం.
ఆ జిల్లా ఓటరు జాబితాలో సీఎం జగన్ ఫొటో - ఖంగుతిన్న అసలు ఓటరు
గ్రామస్థుల ఆరోపణలు :గుడ్లూరు మండలం కమ్మపాలేంనికి చెందిన వేణు, అనూష దంపతులు. వీరిపేర్లు 184 పోలింగ్ కేంద్రంలో ఉండేవి. తుది జాబితాలో సీరియల్ నంబరు 532లో భర్త వేణుగోపాల్ పేరు ఉండగా, 533లో ఉండాల్సిన అనూష పేరు "డిలీట్" ముద్రవేసి తొలగించారు. నరుకూరులోని 77 పోలింగ్ కేంద్రం పరిధిలో పక్క గ్రామాల వారి ఓట్లు జాబితాలో ఉన్నాయి. సీరియల్ నంబరు 630లో కోడూరు విష్ణువర్ధన్‌రెడ్డి, 629లో కోడూరు రూపారెడ్డి పేర్లు ఉన్నాయి. వీరికి 2-37A ఇంటి నంబరుతో ఓట్లు నమోదయ్యాయి.
విష్ణువర్ధన్‌రెడ్డి చిన్నచెరుకూరుకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు. వీరికి గ్రామంలో ఇల్లు ఎలా వచ్చిందనేది అధికారులే చెప్పాలని స్థానికులు అంటున్నారు. వరుస నంబరు 718లో చొప్పల సంతోశ్, 719లో బండి సురేశ్, 721లో కందుకూరు పోలయ్య అనే పేర్లుజాబితాలో ఉన్నాయి. వీరూ ఈ గ్రామానికి చెందిన వారే కాదు. 598లో మన్నెం కృష్ణవేణమ్మ, 599లో మన్నెం రమణయ్యలు భార్యభర్తలుగా చూపారు. వీరిది నరుకూరు గ్రామం కాదు. స్థానిక వైఎస్సార్సీపీకి చెందిన వ్యక్తి బంధువులు కావడంతో వీరి పేర్లు జాబితాలో చేర్చారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
Fake Votes in AP: ముందుకు సాగని ఓటర్ల జాబితా సవరణ సర్వే.. బీఎల్వోల ముందు సమస్యల చిట్టా..