ఆంధ్రప్రదేశ్

andhra pradesh

100 పునరావాస కేంద్రాలు- 17 స్పెషల్ టీంలు-సిద్దంగా హెలికాప్టర్లు - Ministers review on flood situation

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 1, 2024, 5:05 PM IST

Ministers are Conducting Series of Reviews Due to Rains : రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో మంత్రులు వరుస సమీక్షలకు దిగుతున్నారు. పరిస్థిని బట్టి క్షేత్రస్థాయిలో పర్యటించి నీటి ప్రవాహలపై అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసే సూచనలు హెచ్చరికలు పాటించి ప్రజలు సురక్షితంగా ఉండాలని మంత్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Ministers are Conducting Series of Reviews Due to Rains
Ministers are Conducting Series of Reviews Due to Rains (ETV Bharat)

Ministers are Conducting Series of Reviews Due to Rains : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సహాయక చర్యలపై మంత్రులు వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. భారీ వర్షాల కారణంగా విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో వరద పరిస్థితిని హోం మంత్రి అనిత సమీక్షించారు. ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అధిక వర్షాల కారణంగా ఇంత వరకు 100 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. ఈ ప్రాంతాల్లోని 294 గ్రామాలకు చెందిన 13,227 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు. అత్యవసర వైద్యం కోసం 61 మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు. పోలీస్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బెటాలియన్ల బృందాలు ముంపు ప్రాంతాల్లోని 600 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించాయని తెలిపారు.

ప్రభుత్వం జారీ చేసే హెచ్చరికలు పాటించాలి : అలాగే 9 ఎస్డీఆర్ఎఫ్, 8 ఎన్డీఆర్ఎఫ్ మొత్తం 17 బృందాలు 7 జిల్లాల్లోని 22 ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారని అనిత స్పష్టం చేశారు. ఎటువంటి అత్యవసర పరిస్థితులనైన ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వరద ప్రాంతాల్లోకి వెళ్లేందుకు 5 బోట్లు , హెలికాఫ్టర్లు సిద్ధంగా ఉంచామన్నారు. వర్షాలు పూర్తిగా తగ్గిన తరువాత పంటనష్టంపై ఎన్యూమురేషన్ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ప్రాధమిక సమాచారం ప్రకారం 14 జిల్లాల్లోని 62,644 హెక్టార్లలో వరిపంట నీట మునిగిందని మంత్రి తెలిపారు. 7218 హెక్టార్లలో ఉద్యాన వన పంటలు నీట మునిగాయన్నారు. రాయనపాడు రైల్వే స్టేషన్లో వరద నీరు చేరటంతో తమిళనాడు ఎక్స్ ప్రెస్ నిలిచిపోయిందని స్పష్టం చేశారు. అందులోని ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశామన్నారు. చాలా ప్రాంతాల్లో ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లి ప్రవహిస్తున్నాయన్నారు. ప్రభుత్వం జారీ చేసే హెచ్చరికలు పాటించి ప్రజలు సురక్షితంగా ఉండాలని కోరుతున్నామని మంత్రి అనిత అన్నారు.

జలదిగ్బంధంలో విజయవాడ - గత 20 ఏళ్లలో ఎన్నడూ చూడనంత వర్షం - ఆరుగురు మృతి - HEAVY RAINS IN VIJAYAWADA

ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా : భారీ వర్షాలతో ముంపుకు గురైన ప్రాంతాల్లో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. తాడేపల్లి టౌన్ నులకపేట క్వారీ ప్రాంతాన్ని పరిశీలించారు. ముంపు బారిన పడిన ఇళ్లను పరిశీలించారు. బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇళ్లలో చేరిన నీటిని వీలైనంత త్వరగా తోడేందుకు చేసిన ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రత్నాలచెరువు ప్రాంతంలోనూ ముంపు బాధిత ప్రాంతాలను లోకేష్ చూశారు. ప్రభుత్వం అందిస్తున్న సాయం గురించి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ సాయం అందరికీ అందుతోందా అని బాధితులను అడిగారు. అధికారులు దగ్గరుండి అన్నిరకాల సహకారం అందిస్తున్నట్లు బాధితులు లోకేష్‌కు చెప్పారు.

బాధితులకు తోడుగా ప్రజా ప్రతినిధులు, అధికారులు : రాజరాజేశ్వరిపేట వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. బుడమేరు వాగు పొంగి ఇళ్లలోకి నీరు చేరింది. వర్షం నీరు చేరి అవస్థలు పడుతున్న వారికి మంత్రి కొల్లు రవీంద్ర భరోసాఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. పునరావాస కేంద్రంలో ఉన్నవారికి ఆహారం అందించాలని సూచించారు. గత రెండు దశాబ్దాల్లో లేని విధంగా రికార్డు స్థాయిలో వర్షం పడిందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ప్రకాశం బ్యారేజీకి 7లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తోందన్నారు. ప్రతి ఒక్క బాధితుడికి అండగా నిలుస్తామని హామీఇచ్చారు. బుడమేరు వాగుకు వరద పెరగడంతో ఎక్కువమంది ఇబ్బంది పడ్డారని అన్నారు. గత ఐదేళ్లలో బుడమేరులో పూడిక తొలగించక పోవడం కూడా నేటి ఉప్పెనకు కారణమని మండిపడ్డారు. వర్షం తగ్గినా కూడా గెట్లు మూసే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో ప్రభావిత గ్రామాల్లోని వారికి తక్షణ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని భరోసాఇచ్చారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు నిన్నటి నుండి ప్రజలతోనే ఉన్నారని మంత్రి వెల్లడించారు.

హైదరాబాద్-విజయవాడ మధ్య రైళ్లు రద్దు- బస్సుల్లో ప్రయాణికులను తరలించేందుకు అధికారుల యత్నం - Trains Cancelled in Rains

సహాయ పునరావస చర్యలపై సూచనలు : విజయవాడలో భారీ వర్షాలపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర , ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు గద్దె, బోండాలు సమీక్షించారు. వివిధ శాఖల అధికారులతో తాజా పరిస్థితులపై చర్చించారు. సింగ్ నగర్, పైపుల రోడ్డు, జెఎన్ య్యూ ఆర్ ఎం తదితర పర్యటించి వచ్చిన మంత్రులు సహాయ పునరావస చర్యలపై సూచనలు చేశారు. గత రెండు దశాబ్దాల్లో లేని విధంగా రికార్డు స్థాయిలో వర్షం పడిందని, ప్రకాశం బ్యారేజీకి 7 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తోందని ప్రతి ఒక్క బాధితుడికి అండగా నిలుస్తుందని తెలిపారు. విజయవాడలో దాదాపు 29 సెంటి మీటర్ల వర్షం నమోదైందని, బుడమేరు వాగుకు వరద పెరగడంతో ఎక్కువమంది ఇబ్బంది పడుతున్నారని అన్నారు.

విద్యుత్ పునరుద్ధరణకు మరో 48 - 72గంటలు : భారీ వర్షాలతో జరిగిన నష్టంపై విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవి సమీక్ష నిర్వహించారు. VTPS లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో 2,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. నీటిని తోడే పనులు నిర్విరామంగా సాగుతున్నాయని చెప్పారు. పోలవరం సైట్ నుంచి హైకెపాసిటీతో నీరు తోడే పంపులు తెప్పిస్తున్నట్లు అధికారులు వివరించారు. బొగ్గు తడిసిపోవడంతో విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరణకు మరో 48 గంటల నుంచి 72గంటల సమయం పడుతుందన్నారు. విజయవాడ పరిసరాల్లో విద్యుత్ అంతరాయంపై ఫిర్యాదులు వచ్చాయన్న మంత్రి రికార్డుస్థాయి వర్షంతో సబ్ స్టేషన్లు కూడా నీటమునిగాయని గుర్తుచేశారు. సమస్యలన్నీ పరిష్కరిస్తూ విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు మంత్రికి అధికారులు నివేదించారు. భారీ వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిపివేశామని, లేదంటే ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు.

నీటి ప్రవాహంతో అప్రమత్తంగా ఉండాలి : ఎగువన కురుస్తున్న వర్షాలకు నంద్యాల సమీపాన కుందునది, మద్దిలేరు వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. కుందునది, మద్దిలేరు వాగులో నీటి ఉధృతిని రాష్ట్ర న్యాయ శాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ పరిశీలించారు. పెరుగుతున్న నీటి ప్రవాహంతో అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇదే ప్రవాహం కొనసాగి వరద నీరు వస్తే లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వం అన్నివిధాల చర్యలు తీసుకుని ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు.

ముంపు ప్రాంతాల ప్రజలకు ఆహారం, తాగునీరు అందించాలి - టీడీపీ శ్రేణులకు నారా లోకేశ్ పిలుపు - Nara Lokesh Review on Rains

పశు నష్టం జరుగకుండా రైతులకు సూచనలు : రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో వ్యవసాయ శాఖ, మత్స్య శాఖ, పశుసంవర్ధక శాఖల కంట్రోల్ రూమ్​లో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షించారు. రెండు రోజుల్లో అధిక వర్షాల కారణంగా రాష్ట్రంలో 4 పశువులు మృతి చెందాయని అధికారులు వెల్లడించారు. పశు నష్టం జరుగకుండా రైతులకు సూచనలు ఇవ్వాలని అచ్చెన్న ఆదేశించారు. పశు వైద్య అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన మందులతో సిద్ధంగా ఉండాలని మంత్రి స్పష్టంచేశారు.

మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు : విజయవాడ మొగల్రాజపురం కొండ చరియలు విరిగిపోయిన ప్రాంతాన్ని పరిశీలించిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ, విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించారు. ఏన్డీఆర్ఎఫ్ సిబ్బంది, సంబంధిత అధికారులతో మాట్లాడి చేపడుతున్న సహాయకు చర్యల గురించి తెలుసుకున్నారు. ఇప్పటికే ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించామని మంత్రి నారాయణ తెలిపారు. ఇల్లు కోల్పోయిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడతామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు.

అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దు - ప్రజలకు మంత్రుల సూచన - Ministers Review on Heavy Rains

ABOUT THE AUTHOR

...view details