Minister Valagapudi Anita In Cyber crime Awareness Walkathon in Vijayawada : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని సైబర్ సెల్ పనితీరు మెరుగుపరచడమే కాకుండా- రోజురోజుకీ కొత్తపుంతలు తొక్కుతున్న సైబర్ మోసాల బారినుంచి ప్రజలను కాపాడేందుకు రాష్ట్ర స్థాయిలోనూ సైబర్ కో ఆర్డినేషన్ టీం ఏర్పాటు చేస్తామని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విజయవాడ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏర్పాటు చేసిన వాక్‌థాన్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
16 రకాల సైబర్ మోసాల గురించి ప్రజలకు వివరించి- వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు నగర పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్‌బాబు ఆధ్వర్యంలో రూపొందించిన మొబైల్‌యాప్‌ను మంత్రి అనిత, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహనరావు, బోండా ఉమామహేశ్వరరావు లాంఛనంగా ఆవిష్కరించారు. ఇందిరాగాంధీ మైదానం నుంచి బెంజిసర్కిల్ వరకు వాక్‌థాన్ చేశారు. బెంజిసర్కిల్ వద్ద మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. విజయవాడ నగర పరిధిలో సాంకేతికపై అవగాహన ఉన్న వారిని ఎంపిక చేసుకుని వారిని సైబర్ సైనికుల ద్వారా నియమించి- ఒక్కొక్కరు వంద మంది నగర పౌరులకు ఈ మోసాల గురించి తెలియజేసి వారిని అప్రమత్తం చేయడం ద్వారా పౌరులను సైబర్ సిటిజన్లుగా తీర్చిదిద్దేలా చూడడమే ప్రధాన లక్ష్యంగా విజయవాడ నగర పోలీసు కమిషనరేట్ తీసుకొన్న చొరవ ప్రశంసనీయమని మంత్రి అనిత అన్నారు.
'పెరుగుతున్న సాంకేతికతను ఆధారంగా చేసుకుని- మనుగడనే ప్రశ్నార్ధకం చేసేలా జరుగుతున్న కొత్త తరహా మోసాలకు ముకుతాడు వేయాల్సిన సమయం వచ్చింది. నాలుగు నెలల్లో దేశవ్యాప్తంగా 1730 కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్ల ద్వారా చేతులు మారడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీని గురించి ప్రజలంతా ఆలోచించాల్సిన సమయం ఇదే . ఈ మోసాల బారినపడుతోంది ఎక్కువగా ఉన్నత విద్యావంతులే. 24 శాతం సైబర్ క్రైం రేటు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.'-హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత