Digital Health Card Guidelines : ఫ్యామిలీ డిజిటల్ కార్డు, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటి, ఎల్ఆర్ఎస్, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై సీఎస్ శాంతికుమారితో కలిసి కలెక్టర్లతో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డిజిటల్ కార్డులో పొరపాట్లకు తావివ్వకుండా వాస్తవాలకు దగ్గరగా కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు.
యూనిక్ నెంబర్‌తో స్మార్ట్‌కార్డు : పేద, మధ్య, ధనిక అనే తేడా లేకుండా ప్రతి కుటుంబానికి యూనిక్ నెంబర్‌తో స్మార్ట్‌కార్డు ఇవ్వడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. 119 నియోజకవర్గాల్లోని 238చోట్ల పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించినట్లు వివరించారు. నియోజకవర్గానికి రెండు లెక్కన ఎంచుకోవాలని సూచించారు. ఈ నెల మూడవ తేదీన నుంచి ఏడో తేదీ వరకు ఎంపిక చేసిన ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో ఇంటింటికి వెళ్లి పకడ్బందీగా వివరాలు సేకరించాలని మంత్రి పొంగులేటి స్పష్టంచేశారు.
డిజిటల్ కార్డుల వివరాల సేకరణ పర్యవేక్షణకు నియోజకవర్గానికి ఆర్టీవో స్థాయి, జోనల్ కమిషనర్ స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నట్లు పొంగులేటి తెలిపారు. మండలానికి తహశీల్దారును నియమిస్తున్నట్లు వెల్లడించారు. కుటుంబ సభ్యుల వివరాల నమోదు, మార్పులు చేర్పుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టంచేశారు. హెల్త్ కార్డుల విధానం, అమలు, ఫలితాలపై అధికారుల బృందం పలు రాష్ట్రాల్లో పర్యటించి నివేదిక అందించినట్లు తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డి సూచనలకు అనుగుణంగా పైలట్ ప్రాజెక్టు చేపట్టినట్లు వివరించారు. ఆ పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఈ నెల మూడవ తేదీన ప్రారంభిస్తారని పొంగులేటి వెల్లడించారు. అందులో ఎదురయ్యే మంచి చెడులను, పరిగణనలోకి తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా అమలను పరిశీలిస్తామని వివరించారు. నాలుగైదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను యుద్ధప్రతిపాదికన పరిష్కరించాలని కలెక్టర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు.