CRDA 44th Authority Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సీఆర్డీఏ 44వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మరో 2,723 కోట్ల రూపాయల రాజధాని అమరావతి నిర్మాణ పనులకు సీఎం ఆమోదం తెలిపారు. వచ్చే ఏడాది జూన్ 12 కల్లా 1.18 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేసి ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సీఆర్డీఏ అథారిటీ 44వ సమావేశం జరిగింది.
ఎల్పీఎస్ జోన్ 7, జోన్ -10లో మౌలిక వసతుల కల్పనకు సమావేశం నిర్ణయం తీసుకుంది. రాజధాని అవుటర్ రింగ్ రోడ్డు, విజయవాడ బైపాస్ రోడ్ ప్రాజెక్టుపైనా చర్చించారు. ఇప్పటివరకూ 47, 288 కోట్ల రూపాయల విలువైన పనులు చేపట్టేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. వచ్చే నెల 15 కల్లా రాజధాని నిర్మాణ పనుల టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు.
టిడ్కో గృహాలపైనా చర్చ : టిడ్కో గృహాలపైనా సీఎం సమీక్ష నిర్వహించారని మంత్రి తెలిపారు. జూన్ 12 నాటికి 1.18 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తిచేసి ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో 7 లక్షలకు పైగా టిడ్కో ఇళ్లకు గత తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రం నుంచి ఆమోదం తెచ్చుకుని, 3 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పనులు చేపట్టిందని నారాయణ గుర్తు చేశారు. 3.90 లక్షల రూపాయలు ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయని పేర్కొన్నారు. 2019లో తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగి ఉంటే 7 లక్షల ఇళ్లు పూర్తయ్యేవని తెలిపారు.
జగన్ ప్రభుత్వం 7 లక్షల ఇళ్లను 2.61 లక్షలకు కుదించిందని విమర్శించారు. ఈ 2.61 లక్షల ఇళ్లు పూర్తి చేసేందుకు 7 వేల 512 కోట్ల రూపాయలు అవసరం అవుతాయన్నారు. కట్టని ఇళ్లకు గత ప్రభుత్వం రుణం తీసుకుని అనేక సమస్యలు తెచ్చిందని మండిపడ్డారు. బ్యాంకులకు 102 కోట్లు కడితే కానీ ఇళ్ల నిర్మాణం ముందుకు కదలని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. బ్యాంకులకు కట్టాల్సిన 102 కోట్లు విడుదలకు సీఎం ఆమోదం తెలిపారని వ్యాఖ్యానించారు.