Minister Nara Lokesh Meet Google Cloud CEO: మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన బిజీబిజీగా సాగుతోంది. విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ డాటా సెంటర్ ఏర్పాటు చేయాలని సంస్థ ప్రతినిధులను ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కోరారు. యువతలో నైపుణ్యాభివృద్ధి, స్మార్ట్ సిటీ కార్యక్రమాలకు సహకరించాలని విజ్ఞప్తిచేశారు. ఈ-గవర్నెన్స్, డిజిటల్ విద్యకు ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయాలని లోకేశ్ ప్రతిపాదించారు. శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ క్లౌడ్ సీఈఓ, వైస్ ప్రెసిడెంట్లతో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, బికాస్ కోలే (వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ నెట్ వర్కింగ్), రావు సూరపునేని (వైస్ ప్రెసిడెంట్, బిజినెస్ అప్లికేషన్ ప్లాట్ ఫామ్స్), చందు తోట (వైస్ ప్రెసిడెంట్, గూగుల్ మ్యాప్స్)లతో ఆయన భేటీ అయ్యారు.
సహచర బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని గూగుల్ క్లౌడ్ ప్రతినిధులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ క్లౌడ్ ఇన్ ఫ్రాస్ట్చక్చర్ హబ్‌గా తయారవుతోందని లోకేశ్ తెలిపారు. విశాఖపట్నంలో డేటా సెంటర్ల ఏర్పాటుపై దృష్టిసారించామన్నారు. పీపీపీ మోడ్‌లో గూగుల్ క్లౌడ్ డాటా సెంటర్‌ను ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఈ రంగంలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మకమైన ప్రాంతమని తెలిపారు. విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ఏఐ ఆధారిత ఈ-గవర్నెన్స్, స్మార్ట్ సిటీ కార్యక్రమాలను అమలుచేస్తోందన్నారు. ప్రభుత్వ కార్యకలాపాలను డిజిటలైజ్ చేయడం ద్వారా మెరుగైన పౌరసేవలు అందించేందుకు ఏఐ టూల్స్, ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్ కల్పించాలన్నారు.
టెస్లా ప్రధాన కార్యాలయంలో మంత్రి లోకేశ్ - పెట్టుబడుల వేటలో కీలక పరిణామం
ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యులు కండి:స్టార్ట్ సిటీల్లో జియో స్పేషియల్ సేవల్లో భాగంగా రియల్ టైమ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, డిజాస్టర్ రెస్పాన్స్, అర్బన్ ప్లానింగ్‌తో సహా స్మార్ట్ సిటీ కార్యక్రమాలను గూగుల్ మ్యాప్స్‌తో అనుసంధానించడం కోసం ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయాలని కోరారు. ఏపీలో డిజిటల్ ఎడ్యుకేషన్, యువత నైపుణ్యాభివృద్ధికి ఏఐ ఆధారిత శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్మించడం, ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడం, స్మార్ట్ సిటీ సామర్థ్యాలను మెరుగుపరచడంలో ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యులు కావాలని కోరారు. ఆన్‌లైన్ రీసెర్చి, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ అడ్వర్టైజింగ్‌లో తమ సంస్థ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని గూగుల్ క్లౌడ్ ప్రతినిధులు తెలిపారు. ఏఐ, అటానమస్ టెక్నాలజీలో వెంచర్లతో పురోభివృద్ధి సాధిస్తోందన్నారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఆల్ఫాబెట్ (గూగుల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారుగా $2.01 ట్రిలియన్‌లుగా ఉందని గూగుల్ క్లౌడ్ ప్రతినిధులు తెలిపారు.
నారా లోకేశ్ టూర్ అప్డేట్స్ - సత్య నాదెళ్ల, శంతను నారాయణ్‌తో భేటీ
Minister Lokesh Meet INDIASPORA, US India Business Council Delegates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్టార్టప్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా అభివృద్ధి చెందుతోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఏఐ వర్సిటీ, డేటా సెంటర్లు రాబోతున్నందున పెట్టుబడులకు ఇదే సరైన సమయమని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఇండియాస్పోరా, యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో లోకేశ్ సమావేశమయ్యారు. ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు, సువిశాలమైన తీర ప్రాంతం, విస్తృతమైన రోడ్డు, జల, వాయురవాణా మార్గాలు కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు పూర్తి అనుకూల వాతావరణం నెలకొందని తెలిపారు. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని భావించే వారికి ఇదే మంచి సమయమని అన్నారు.
ఏఐ యూనివర్సిటీని ఏర్పాటుచేస్తున్నాం: ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ వేగవంతంగా అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు. పరిశ్రమలకు అవసరమైన ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఎటువంటి జాప్యం లేకుండా అనుమతుల కోసం ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డును పునరుద్దరించామన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా అనంతపురంలో ఆటోమొబైల్, కర్నూలులో రెన్యువబుల్ ఎనర్జీ, విశాఖలో ఐటీ, ఫార్మా, వైద్యపరికరాల తయారీ, ప్రకాశంలో బయోఫ్యూయల్, గోదావరి జిల్లాలో ఆక్వా పరిశ్రమలకు ప్రోత్సహం అందించాలని నిర్ణయించామన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్హానంతో త్వరలో అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి నిపుణులను తీర్చిదిద్దేందుకు వీలుగా ఏఐ యూనివర్సిటీని ఏర్పాటుచేస్తున్నామని నారా లోకేశ్ తెలిపారు.
గుడ్ న్యూస్ - త్వరలో విశాఖకు ఏవియేషన్ వర్సిటీ, డాటా సెంటర్!
Minister Lokesh Meet Salesforce President: ఇ-గవర్నెన్స్, పబ్లిక్ సెక్టార్లలో ఏఐ, క్లౌడ్ టెక్నాలజీలను సమర్థవంతంగా వినియోగించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ స్పష్టంచేశారు. గ్లోబల్ టెక్ హబ్‌గా మారబోతున్న ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని మంత్రి కోరారు. సేల్స్‌ఫోర్స్ ప్రెసిడెంట్ శ్రీని తల్లాప్రగడ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ రాగినేనితో లోకేశ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా CRM సొల్యూషన్‌లు, ఏఐ-డ్రైవెన్ పబ్లిక్ సర్వీసెస్, స్మార్ట్ సిటీ కార్యక్రమాలను అమలు చేయడానికి సేల్స్‌ఫోర్స్ సహకారాన్ని కోరారు. డాటా సేవల రంగానికి అనువైన వాతావరణ కలిగిన విశాఖపట్నంలో ఆర్ అండ్ డీ సెంటర్‌ను ఏర్పాటుచేయాలని విజ్ఞప్తిచేశారు. గ్లోబల్ టెక్ హబ్‌గా మారబోతున్న ఏపీలో సేల్స్‌ఫోర్స్ క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌లు, ఏఐ సొల్యూషన్లను సమగ్రపరచడం వంటి సేవలు తమకు ఉపకరిస్తాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సేల్స్ ఫోర్స్ ఉన్నతాధికారులు తెలిపారు.
పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మంత్రి లోకేశ్ అమెరికా పర్యటన - పారిశ్రామిక వేత్తలతో రౌండ్‌టేబుల్ సమావేశం