Minister Nara Lokesh Invited NASSCOM: రాష్ట్రంలో ఐటీ సేవల విస్తరణకు అపార అవకాశాలు ఉన్నాయంటూ మంత్రి నారా లోకేశ్ పెట్టుబడిదారులకు ఆహ్వానం పలికారు. కర్నాటక ప్రభుత్వం తెచ్చిన స్థానికులకు ఉద్యోగాలు అనే చట్టంపై జరుగుతున్న వివాదాన్ని ఉద్దేశించి ఎక్స్‌లో ఐటీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. కర్నాటకలో తెచ్చిన కొత్త చట్టంపై పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, నాస్కామ్ (National Association of Software and Service Companies) వంటి సంస్థల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
దేశ వ్యాప్తంగా కర్నాటక చట్టంపై చర్చ మొదలైన తరుణంలో ఆ పరిణామాలను అనుకూలంగా మార్చుకుంటూ నాస్కామ్‌కు స్వాగతం పలికేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని లోకేశ్ ప్రతిపాదనలు పంపారు. కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024 పరిశ్రమల బిల్లుపై నాస్కామ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎక్స్‌లో పెట్టిన పోస్ట్‌కు లోకేశ్ సమాధానంగా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను పంచుకున్నారు.
పెట్టుబడిదారుల ఆవేదన, అభ్యంతరాలు తాను అర్థం చేసుకున్నానని, ఏపీలో ఎటువంటి ఆంక్షలు, ఇబ్బందులు ఉండవని, పెట్టుబడులు పెట్టొచ్చంటూ ఓపెన్ ఆఫర్ ప్రకటించారు. ఏపీలో ఐటీ, ఐటీ సేవలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్ క్లస్టర్‌కి, వ్యాపారాలకు విశాఖ అనకూలంగా ఉంటుందని తెలిపారు. తమ వ్యాపారాలను ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేసుకోవటం లేదా విస్తరించుకోవచ్చని సూచించారు.