Minister Nara Lokesh America Tour For Investments : అభివృద్ధి వికేంద్రీకరణ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తోందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా లోకేశ్ పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం అయ్యారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఈక్వెనెక్స్ డాటా సెంటర్‌ను సందర్శించిన ఆయన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. విశాఖలో ఏవియేషన్ వర్సిటీ, డాటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
రాయితీలతో పాటు మెరుగైన ప్రోత్సాహకాలు :రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి లోకేశ్ రెండో రోజు అమెరికా పర్యటన సాగింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రఖ్యాత డాటా సేవల సంస్థ ఈక్వెనెక్స్ డాటా సెంటర్ గ్లోబల్ ఎండీ కౌషిక్ జోషి, సీనియర్ స్ట్రాటజిక్ సేల్స్ ఇంజినీర్ రాబర్ట్ ఎలెన్‌లతో లోకేశ్ భేటీ అయ్యారు. తమ కంపెనీ అందిస్తున్న డాటా సేవలు, కార్యకలాపాలను వారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. తమ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 260కి పైగా ఇంటర్నేషనల్ బిజినెస్ ఎక్స్చేంజీ డాటా సెంటర్ల నెట్‌వర్క్ కలిగి ఉందని వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో డాటా సెంటర్ ఏర్పాటుకు గల అనుకూలతలను లోకేశ్ వివరించారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ఎలక్ట్రానిక్స్ పాలసీలో పవర్ సబ్సిడీ, స్టాంప్ డ్యూటీ మినహాయింపు వంటి రాయితీలతో పాటు మెరుగైన ప్రోత్సాహకాలు కూడా ప్రకటించామని చెప్పారు. భారత్‌లో పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన వాతావరణం నెలకొన్న ఆంధ్రప్రదేశ్‌లో డాటా సెంటర్ ఏర్పాటు చేయాలని లోకేశ్ ఆహ్వానించారు. ఈక్వెనెక్స్ ముందుకు వస్తే తాము అన్నివిధాలా సహాయ, సహకారాలు అందజేస్తామని చెప్పారు.
పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మంత్రి లోకేశ్ అమెరికా పర్యటన - పారిశ్రామిక వేత్తలతో రౌండ్‌టేబుల్ సమావేశం
అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం :తర్వాత శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో లోకేశ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం ఉందని చెప్పారు. యువతకు రాబోయే అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పించాలన్న లక్ష్యానికి అనుగుణంగా సీఎం చంద్రబాబు ఆరు పాలసీలను ప్రకటించారన్నారు. కర్నూలు జిల్లాను డ్రోన్ వ్యాలీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సంకల్పించారని ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలను ఎలక్ట్రానిక్స్ హబ్‌గా తయారు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ప్రకాశం జిల్లాలో బయో ఫ్యూయల్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నామన్నారు.
వారంతా రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలి : కృష్ణా, గుంటూరు క్యాపిటల్ రీజయన్‌లో 5 బిలియన్ డాలర్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్లు వివరించారు. డిసెంబర్ నుంచి అమరావతి నిర్మాణపనులు ప్రారంభం కాబోతున్నాయన్నారు. త్వరలో విశాఖలో TCS సంస్థ తమ కార్యకలాపాలను ప్రారంభించబోతోందన్నారు. భారత్‌లో డాటా రెవెల్యూషన్ రాబోతోందని ఎలక్ట్రానిక్స్ రంగంలో 300 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. అమెరికాలోని వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు APకి వచ్చి రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు.
200 మంది కార్యకర్తలతో ఫోటోలు : గూగుల్ CTO ప్రభాకర్ రాఘవన్, జనరల్ అటమిక్స్ సీఈవో డాక్టర్ వివేక్‌లాల్, నియోట్రైబ్ వెంచర్స్ ఫౌండర్ కిట్టూ కొల్లూరి, జనరల్ కేటలిస్ట్స్ ఎండీ నీరజ్ అరోరా, ఐ స్పేస్ ప్రెసిడెంట్ రాజేష్ కొత్తపల్లి, సీఎఫ్ఓ ప్రసాద్ పాపుదేసి, గూగుల్ మాజీ అధికారి సారిన్ సువర్ణ, స్మియోటా కంపెనీ ప్రతినిధులతో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో కొత్తగా తెచ్చిన పారిశ్రామిక పాలసీలు, ప్రోత్సాహకాలను వారికి వివరించారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో తాను బసచేసిన హోటల్‌లో టీడీపీ కార్యకర్తలు, అభిమానులతో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. సుమారు 200 మంది కార్యకర్తలతో ఫొటోలు దిగారు.
ఏపీలో పెట్టుబడులకు దక్షిణ కొరియా సంస్థల ఆసక్తి - మంత్రి లోకేశ్‌తో భేటీ
పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అమెరికా పర్యటన - అపూర్వ స్వాగతం పలికిన అభిమానులు