SLBC Meeting in AP : రాష్ట్రంలోని కౌలు రైతులకు రుణాలు అందించడానికి బ్యాంకులు మానవతా దృక్పథంతో ముందుకు రావాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో జరిగిన 228వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా 2024 ఏడాదిలో మొదటి త్రైమాసికానికి సంబంధించిన పురోగతిని అచ్చెన్నాయుడు సమీక్షించారు.
ఈ సందర్భంగా బ్యాంకింగ్ కీ ఇండికేటర్స్, 2024-25 మొదటి త్రైమాసిక బ్యాంకుల వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యసాధన, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాయోజిత పధకాలు, ఫైనాన్సియల్ ఇన్క్లూజన్, డిజిటల్ జిల్లాలు, కేంద్ర ప్రభుత్వ పథకాల విస్తృతి అమలు, ఆర్బీఐ సూచనల అమలుకు సంబంధించిన అంశాలపై ఎస్ఎల్బీసీ సమావేశం చర్చించింది. వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఏపీలోని కౌలు రైతులు 9 లక్షల మందికి సీసీఆర్సీ కార్డులు జారీ చేశామని అచ్చెన్నాయుడు తెలిపారు. కానీ బ్యాంకులు ఇప్పటి వరకూ కేవలం 2 లక్షల మందికి మాత్రమే రుణాలు అందించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
Atchannaidu on SLBC Meeting : రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో 50 లక్షల ఎకరాలను ప్రకృతి సేద్యం కిందకు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఏపీ సర్కార్ ఆరు రంగాల్లో విధాన నిర్ణయాలను ప్రకటించిందని చెప్పారు. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు వీలుగా బ్యాంకులు ప్రణాళికలు చేయాల్సిందిగా అచ్చెన్నాయుడు సూచించారు.
పీఎం ముద్రా యోజన, విశ్వకర్మ తదితర పథకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం వివిధ బ్యాంకులకు లక్ష్యాలను నిర్దేశించిందని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. అయినా క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు కావడం లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి ,సంక్షేమ పథకాలకు సాంకేతికతను జోడించి వాటిని ముందుకు తీసుకెళ్లేందుకు బ్యాంకులు సహకరించాలని మంత్రి కోరారు. వరదల సమయంలో బ్యాంకులు అందించిన సహకారానికి అచ్చెన్నాయుడు ధన్యవాదాలు తెలిపారు.