Minister Anitha About Cannabis Illegal Transport in YSRCP Regime :గంజాయి నేరస్థులపై కేసులు పెట్టడంతో పాటు వారి ఆస్తులు స్వాధీనం చేసుకునేలా కఠిన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి అనిత వెల్లడించారు. వారికి ఆస్తులు లేకపోతే ఆధార్, రేషన్ కార్డులను సీజ్ చేస్తామని తెలిపారు. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో గంజాయి విచ్చలవిడిగా పెరిగిందని, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలను అడ్డుకునేందుకు నేరస్థుల వివరాలతో ప్రొఫైలింగ్ చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలన, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు, ఆన్‌లైన్ రుణ యాప్‌లపై ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, రెడ్డప్పగారి మాధవీరెడ్డి, సుందరపు విజయ్‌కుమార్, భూమా అఖిల ప్రియ అడిగిన ప్రశ్నలకు శాసనసభలో గురువారం మంత్రి సమాధానమిచ్చారు.
ఏజెన్సీ ప్రాంతాల నుంచి చిన్న పిల్లల పాఠశాల బ్యాగ్‌ల్లో గంజాయి వచ్చి చేరిందని, గంజాయి వల్ల తమ జీవితాలు ఎంత నాశనమయ్యాయో మంత్రి లోకేశ్ పాదయాత్ర సమయంలో ఓ తల్లి ప్రస్తావించిందని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ పాలనలో గంజాయి రవాణాను అరికట్టేందుకు చెక్‌పోస్టులు, సీసీ కెమెరాలు సక్రమంగా ఏర్పాటు చేయలేదని ధ్వజమెత్తారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న చర్యల కారణంగా 25వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 916 మందిపై కేసులు నమోదు చేశామని, తాజాగా రాజమహేంద్రవరం జైల్లో ఉన్న నిందితుడికి ఒక ఫార్మసిస్టు గంజాయి అందించిన ఘటనలో నిఘా అధికారులు అతన్ని అరెస్టు చేసి, జైలుకు పంపారని వివరించారు. గంజాయి నిర్మూలనతోపాటు ప్రజల్లో సామాజిక బాధ్యత పెంచేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి అనిత తెలిపారు.